RSS
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

రేణుక అయోల కవిత


కొన్ని సందర్భాలు వాటికవే సందేహాలుగా మారి పోతాయి
సందర్భమే మనిషిని పెనవేసుకుని జ్జాపకంగా మిగిలి పోతుంది
జనం మధ్యలో మనం మనకి మనమే అపరిచితులం

పరిచయం లేని ముఖాల మధ్య ఒంటరిగా
రోజు నడిచే దారులు నిత్యం చూసే వస్తువులు
ఏవి సొంతం కాని సందర్భాలు
ఏదో సందర్భంలో ఒక ముఖం మనకి చేరువ అవుతుంది
ఏ సందర్భం లేకుండానే మనసులో ప్రతిష్టింపబడుతుంది
దాన్ని గుండెల్లో మోస్తూ అలోచనల్లో పెనవేసుకుంటూ

ఆ ముఖం  సందర్భం కోసం వెతుకుతుంటాము
నడిచే దారిలోనో కదుల్తున్న బస్సులో
మనకిష్టమైన ముఖం మెరుపులామెరుస్తుంది
జ్జాపకమై మెలిపెట్టే ఆ ముఖం  కనిపించిన సందర్భం

ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్నిస్తుంది
అనామకం అపరిచితం
అయినా మనం కోరుకున్నది
ఊహల్లో చిరునామా లేని ఉత్తరం
ఆ ముఖంకోసం ఎన్ని సార్లు పోస్టు చేయబడిందో
సందర్భం కాని సందర్భంలో ఆ ముఖ పరిచయం కొన్ని క్షణాలు

ఏ కారణం లేకుండా వెంటాడిని రోజులెన్నో
సంఘటనలాంటి ఇలాంటి సందర్భాలు
జ్జాపకాల పోరల్లో మరుగున పడిపోతాయి
మళ్ళీ ఎప్పుడో ఏ సందర్భంలోనో
రాయితాకిడికి కదిలిన నీటి వలయాలై చుట్టుకుంటాయి.
---------------
నెలనెలావెన్నెల అయిదవ సంకలనం (2010)నుండి
0 కామెంట్‌లు

జ్వర సంధి ..............మునిపల్లె రాజు

జ్వరం నాకొక వరం
అది నా స్వగతాల స్వరం
జ్వరం నా జనని వడి
సడిచేయని వెచ్చని నది

అనాది స్వప్నాల నక్షత్ర యాత్రలను
దేహంవీడి దైన్యంగా పయనిస్తున్న ఆత్మకు
ఎన్నో పురో భయాల పాంద్రతర చిత్రాలను
రంగులు మారుతున్న ఉష్ణరక్త ప్రస్థానాన్ని

జ్వరసంధిలో తిలకిస్తుంటాను
ఎన్నడూ వినని భాషలో కవితలల్లుతుంటాను

చీలిన పొగమంచు తెరల రధ్యల్లో
జయ జయ మృదంగ నాద నేపధ్యంతో
ఏడుతరాల నా పూర్వికుల దర్శనం
ఆశువుగా ఆశాదుల ఆశః పరంపర
ఆకలి దప్పులు లేని ఆనంద మఠ విశ్రాంతి

జ్వరంలో నాకు సాధ్యం
యోగనిద్రకు అదే నా భాష్యం
......................................................నెలనెలా వెన్నెల-5 సంకలనం నుంచి
2 కామెంట్‌లు

శేషభట్టర్ రఘు కవిత నెల నెలా వెన్నెల సంకనం-5

తనొక మంత్రదండం - నేనొక పిల్లన గ్రోవి


శేషభట్టర్ రఘు




ఆమె
మందారానికి బంగారం అద్దినట్టు నవ్వుతుంది

అప్పుడు
వెన్నెలకు చిల్లుపడి గదిలోకి రాల్చినట్టుంటుంది

తన మెత్తని పెదాల ఉన్నిచర్మం మంత్రదండంలా
జఢత్వాన్ని చిత్తుచేస్తుంది

ఇక నీటి పక్షుల్లా తిరిగే నా ప్రేమాన్విత మోహాన్ని
ద్రాక్షారస సాయంత్రాన్ని
మనోహర పుష్పంలాంటి తన ఉనికివైపు నడుపుతాను

ఒక ధూమ ప్రతిమనై
తను శ్వాసించే దారుల్ని తాకుతాను

ఏమాటామకామాట విడివిడిగా పేర్చిన
పొడిప్రేమల పలకల్ని విసిరేసి వస్తాను

ఇక కలల కొనలమీద
పిల్లనగ్రోవిలాంటి వాక్యం నేను

నెల నెలా వెన్నెల On Kinige


3193 1 కామెంట్‌లు

వాడ్రేవు చినవీరభద్రుడు కవిత నెలనెలా వెన్నెల అయిదవ సంకలనం నుంచి

అదిలాబాద్ క్రిస్మస్, 2000

......వాడ్రేవు చినవీరభద్రుడు

మళ్ళీ అదేదారి, అదే అడవి
ఒణికిస్తున్న శీతపవనాలు
భువి పైన వేల శుభాకాంక్షలు
క్రిస్మస్ తారలు

విజ్జీ, దగ్గరగా జరుగు, సర్దుకు కూచో
ఈ ఎర్రబస్సులో ఈ గుడిహత్నూర్,
ఈ ధనోర, ఈ ఇంద్రవెల్లి
కట్టుకోవడానికి గుడ్దకు కూడా నోచని
ఆ తల్లులు, ఆ పిల్లలు

విజ్జీ, పయనించాలి మనం
కనీసం ఆరునెలలకొకసారైనా
ఈ అడవిబాటని, వెతుక్కుంటూ
మనని మనం గుర్తుపట్టడానికి

విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత
చెక్‌డాంలు, పత్తిచేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ, దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి

విజ్జీ, ఇది మనవూరు, మన అడవి.

............3127 0 కామెంట్‌లు

అయితేనేం??


ముకుంద రామారారావు
9908347273

ఒక్కొక్కటిగా
అవయవాల సహాయ నిరాకరణ

అతనికిపుడు వినబడదు
బోలెడన్ని తెలుసుకోవాలని
అణుచుకోలేని ఆరాటం ఎపుడూ

ఎవరెవరో దగ్గరగా వచ్చి
ఏవేవో చెబుతారు

కాస్త నవ్వుతూ
తలూపుతూ
గాలిలో చేయూపుతూ
శ్రద్దగా వింటున్నట్టున్నా
వినబడి వినబడక
తెల్లమొహం వేస్తున్నట్టు
కనపడనీయని చిరునవ్వు

సమాధాల్ని బట్టి
వినబడ్డదో లేదోనన్న అంచనా
అందరిదీ

నిశ్శబ్దంలోనే అతను
అన్నీ మాటాడుతూనే ఉన్నాడని
కాస్సేపూ
పోగొట్టుకున్నదేదో పొందుతూనే ఉన్నాడని
ఎవరికెంత తెలుసు


(ఎందరో కవులకు నెలనెలా వెన్నెలైన సి.వి. కృష్ణారావు గారికి నమస్సు మనస్సుతో)

నెలనెలావెన్నెల 5 సంకలనము నుంచి http://kinige.com/kbook.php?id=141 1 కామెంట్‌లు

వైతరణి

వైతరణి
ఒక్కొక్క నగరం దేహం మీద
మానని రాచపుండులా
వేదన హృదయంలో ఒత్తిగిలక
వెలికి వచ్చిన ఒక చిహ్నంలా
మూలకొక్క మురికిపేట
వేలకొలది జనుల విషాద గాధ

బురదలో పురుగులు మసలినట్లు
ఎన్నడూ మోములెత్తి మిన్నువైపు చూడక
వేడికి ఎండి చలికి స్రుక్కి
గాలికి వాలి తుఫానులో తృళ్లిపడి
ఈబంధన సత్యమని
ఈ బ్రతుకు అనిత్యమని
బాధల మహాభారతంలో
మురికిపేటలో మసలే మూగజీవాలు

గుడిసెల చూరు భూమికి జాగిలపడి
తమ సంపాదన
వేదనతో రోదించే శిశువుల
పెదిమలు తడపజాలని సలిల బిందువులై
రోగాలు వేగంగా మోసుకొచ్చే
క్రిమి కీటకాలు సహగాములై
తమ స్వప్నావస్థలో
కంకాళాలు నింపుకొస్తుంటే
జీవన వ్యాపారం అక్కడా జరుగుతూనే వుంది

స్మశానాలకు చోటు విడమర్చి
భయపడి పక్కకు తొలిగిన హర్మ్యాలు
తమ నగరంలో
సజీవ మానవాస్థిపంజరాలు మసులుతుంటే
ఇంకా ఎటూ కదలటంలేదు

మానవుడు చూడని లోకంలో
ఈ భువినే నిర్మించాలని
చేసే ప్రోద్బలన
ఆకసమంటే హర్మ్యాలు
యమలోకం త్రోవలో వైతరణి
మురికి పేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

వైతరణి ఒడ్డున
బాధకు చిహ్నాలై
సుప్రసిద్ధ గాధలకు నాయకులై
ఒకడు గుహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు
ఒకడు బంధువు


నివాసం = కుటీరంలో - తుఫానులో
ఆశ = ఆరుతూ - వెలుగుతూ
విశ్వాసం = వికసిస్తూ - హ్రస్వమౌతూ
ఓర్పు = ఘనీభవిస్తూ - ఆవిరౌతూ
బ్రతుకు = దు:ఖంలో - నిర్వీర్యతలో.



(వైతరణి - కావ్యం 1968 ఫ్రీవర్స్ ఫ్రంట్‌ ప్రచురణ నుండి)



2744 1 కామెంట్‌లు

సంధ్య - (కవిత)

అంతటా తిరుగుతుంది
మస్తిష్కం
రంగుల్ని అందాల్ని వెంటాడుతుంటాయి
కళ్ళు
చప్పరిస్తుంది మధువు గరళము
జిహ్వ
కాలి వేడిములకు పరవసిస్తుంది
త్వక్కు
నిండాలని పండాలని
ఉదరం
పర్వతాలలో పాతాళంలో
పాదాలు
ఇందర్నీ మరిపించే క్షణం
అది మహత్తరం
సంధ్య

2458

0 కామెంట్‌లు

అమ్మ వచ్చింది నీ మాటలేదు

నాన్నా అమ్మను పిలువు
అమ్మ వచ్చింది నీ మాట లేదు

పాలగ్లాసు నింపి తాగిపో
ఇప్పుడేవస్తా
ఎప్పుడొస్తావు

ఆశల హారాలు నీకు తొడిగి
ఇంత బతుకు బతికాము
నిరాశల హారాలు మాకుతొడిగి
నీవు శాశ్వత శాంతిపొందావు

నిండిన ప్రేమఘటమనుకొన్న
ఈ బొందినుంచి పేగు మాడిపోయింది
అన్ని విలువలు ఆవిరైపొయినయి
పండంటి శిశువును హత్తుకున్న
తల్లి కౌగిలిలో మిగిలిందినీడ
ఇటు బాషాం అటు ఆక్సఫర్డు
నీతో మాట్లాడాల్ని ఎదురు చూస్తున్న స్నేహితులు

దారిన ముల్లు ఎవరిని గాయపరుస్తుందోనని
నీ శకటం దిగి
దారినున్న కంటకాన్ని తొలగించి
ముందుకుసాగిన అల్ప మిత్రుత్వం

గాయపడని పధికుడి చల్లని చూపులు
నీ వెంటున్నా ఆశీస్సులు
నడుస్తున్న బాటలో ప్రతివ్యక్తి
ముఖంలోకి చూస్తూ
రమేశ్ అని పిలిచేటప్పటికి
నా వేపుచూసి
ఎందుకు ఏడుస్తున్నావన్నాడు
------ సి.వి. కృష్ణారావు 4 కామెంట్‌లు

జారిన శిథిలాలు

పసిపిల్ల పొత్తికడుపున
ముసల్ది మంచాన
యాద మర్చిన క్షణాన
విపత్తు

ఎదురైన చీకట్లోకి
ఆర్తనాదాలుతప్ప అండలేక
అందుకునే చేతుల్లేక
వేలాది జనం
వందలాది గ్రామాలు
మాయమైన దారులమీద
పరుగులు
చెట్టుకూలింది
గూడు చెదిరింది
పిట్టలు పుల్లకోసం
తిరుగుతున్నయి

అనాదికాలపు జనకథ మొదలు
బతుకు మళ్ళా మొదటికి
కృష్ణా తుంగభద్రలు పొంగినయి
సూర్యుడు పడమట వుదయించాడు

వెటకారం
నిశ్శబ్దం
వెలుగులేనిదారి
గొంతులేనిఘోష
చిదిమిన ప్రాణం
నేల చచ్చిపోయింది

రేపులేదు 0 కామెంట్‌లు

వర్ణాల దూరాన నా చెల్లి


కవిత్వం గుండెలో గులాబీ పరిమళిస్తుంది
బాధను మరిపించి మనస్సును ఆదరిస్తుంది
ఒక వీరుని విజయకేతనమవుతుంది
కవిత్వమొక్కటే కల్మషాన్ని కడిగేస్తుంది

అయిదు అడుగుల దూరం
అయిదు ఆమడల దూరం
అయిదు వర్ణాల దూరం
ఉంటేనేం


మతిచెరగని మనసు వదలని
నా కవల చెల్లీ
నిన్ను కౌగలించుకుంటాను


అణువణువూపొంగి
ఆత్మీయుణ్ణవుతాను


కవిత నా కన్నీటి చుక్క
ఆనంద భాష్పం
అందులో అందాల బొమ్మవు నీవే


.. వార్త 29.3.2004

0 కామెంట్‌లు

అగ్రగామి అంబేద్కర్‌




పుడమితల్లికి పురుడుపోసి
గోమాత పొదుగు కడిగి
ఇంటికప్పుకు రెల్లుకప్పి
డొక్కకు రెక్కలు కలిపిన
స్పర్శకు అస్పృశ్యత ఫలసాయం
విస్తరి నుండి ఊడిన ఆకులా ?
నావ్ కుదురు నుంచి విరిగిన బద్దలా ?
పాలపుంత నుంచి రాలిన చుక్కలా ?


"ఏడవకు
బైటికిరా,
రాజ్యాలేలంటే
కళ్ళప్పగించి ఏం లాభం ?
పద ఐదో తమ్ముడిగా కాదు
అగ్రగామిగా"
అదుగో
ఎవరో వెల్తురు మోసుకుంటూ వస్తున్నారు
వెలుగు తన కక్కర్లేదా ఏం?
జన సమూహానికి దారి చూపుతున్నాడు
ఆయనే అగ్రగామిగా ఉండి
అవస్థల వ్యవస్థలు దాటుతూ...
ఇంకా సిద్దించని కోర్కల బి.ఆర్‌. అంబేద్కర్‌



సివి. కృష్ణారావు ..... అవిశ్రాంతం నుంచి 3 కామెంట్‌లు