RSS

బురద కత్తులు

బురద కత్తులు
కత్తులకు బురదపూసి పూలదండలు వేసి పూజిస్తున్నారు. తొలకరికి శాంతి కురిస్తే బిచ్చగాళ్ళకు తుపాకిగుండ్లు ఉపాదనం. ఆటస్థలంలో పిల్లలు ఖాళీ తుపాకి గుండ్లు ఏరుకుంటున్నారు.
జూక్స్ బాక్స్లో యుద్దగీతం పల్లవి కప్పుగాకసాసర్లు బిలియర్డ్స్ఆడుతున్నయ్‌. అసావేరి కాకపోతే వీరావేరి.
మిస్టర్కరెంట్ ఇయర్ప్రైజ్పొందిన వాడికి బ్రీఫ్భూకరిస్తామని మ్యూజికల్నైట్స్ఎనౌన్స్చేసింది.
అవతల గృ(గ్ర)హం నుంచి వచ్చిన నిరక్షర కుక్షులు ఘట వాయిద్యానికి పనికివచ్చినా, అవిద్యా సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. - అలవాటు ప్రకారం - నిర్ణయానికి రాకుండా చూడాలని..
లిపిలేని భాషను వెతుక్కుంటూ చేసిన సెర్చి ఫలితంగా వ్రాసిన రిసెర్చి పేపరు చదివి నిఘంటుడు కళ్ళనీళ్ళు కారకుండా వలవా ఏడుస్తుంటే విశ్లేషణ్ కోసం విభూతి మహాత్యం వెతికారు.
నెలకైనారాని వెన్నెలరాత్రి ఫలితంగా కవిత రాయని కవులను శిక్షాస్మృతిలో ఎన్నిరాత్రులు ఎన్ని పగళ్ళు ఎన్ని నెలలు స్వేచ్చా జీవులుగా (పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి పక్షుల్నీ పూలనీ చూస్తూ మకరందస్వాదన చేయమని మబ్బుల్లో తిరగమనీ, అక్కడికి ఎగిరి అనిమిషకన్నెల ట్యూషట్యూతీసుకోమనీ ) వదలాలి.
వెట్టి చాకిరికి వీరు వ్యతిరేక ఉపన్యాసాలిచ్చారు. కాబట్టి కసితీర వీళ్ళతోనే గడ్డపారలు పట్టించి కవిత్వ కూపాలలోనే (కూపోదకం.. వటచ్చాయా..) అమృతం ఉంటుందనే నమ్మకంతో తవ్వమనాలా?
సినిమాహాలు సంకేత స్థలంగా నిర్ణయించుకున్న పిల్లలకు (ఒకరు మగ, ఒకరు ఆడ అనవసర నిబంధన) ప్కరికి ఫస్టుక్లాసు, ఇంకొకరికి డ్రీం సర్కిల్టికెట్లు దొరుకుతై.
ఇంటిలో (వానా) కాలాన్ని బహిష్కరిస్తారని భయపడి చెమటలు పోసేటప్పటికి వాతావరణ ()కాలుష్య సందేశకుడు బంగాళాఖాతంలో అప్పుడే (అపానగాని) వాయుగుండం ఎర్పడిందని రేడియోలో చెప్తే శ్రద్దగావిని, వాయుగుండానికి వానాకాలానికి మూడుముళ్ళు వేస్తామని ఫస్టుక్లాసు డ్రీం సర్కిల్పేర్లతో డ్రాప్టురాసి పెండ్లి ప్రెస్లొ అందించారు.
ఇన్ఫ్లేషన్రోజుల్లో డ్రప్టు కూడా (చెక్కు అంటే చెల్లని కాగితం) రివాల్యూడ్కరెన్సీ అని తెలిసి కూడా ప్రొప్రయిటర్ఒప్పుకున్నా గుమాస్తా భృకుటి ముడివేశాడు. ఆహ్వానాలందుకోని పెండ్లి సంబరాలు చూడాలని పెండ్లి సంబరాలు చూడాలని రూల్లేదు. టి.వి.కాసెట్లో ఫంక్షన్రికార్డుకాకపోతే పెండ్లికొడుకు ఉత్తరకుమారుడు తన 'సైసు'ను చూచి నిశ్చేష్ఠుడైనట్లు నటించి, ఇన్విజిబుల్ఇంక్అన్పాయింటెడ్పెన్‌, ఇన్ఆడిబుల్సౌండ్ఇల్లెజిబుల్ స్క్రిప్ట్‌, అన్గ్రమాటికల్భాషలో శ్రీ శ్రీ గారినో శ్రీ ఆంద్రోబ్రెత్తో గారినో మక్కికి మక్కి కాకుండా కాపీకొట్టి వినిపిస్తుంటే అసహనంతో నైనా విన్న (నిగమ శర్మ జ్ఞాపకం భక్తి లేకుండా జాగరణ చేసిన పుణ్యుడు) మిమ్మల్ని చివరకు?
సి.వి.కృష్ణారావు
నెలనెలావెన్నెల సంకలనం-2 నవంబరు 1990

1 కామెంట్‌లు

వైతరిణికి - శ్రీ కుందుర్తి ముందుమాట

ఒక మంచి ప్రయోగం


ఏ కావ్యానికైనా ఒక కథ అనేది వుంటుంది. ఇది యితివృతానికి సంబంధించిన కథ. కాని యీ కావ్యం వెనకాల మరో కథ వుంది. ముందుగా మనవిచేస్తాను.


శుమారు ఆరేండ్ల క్రితం మిత్రులు శ్రీ సి. నారాయణరెడ్డికి కరీంనగరంలో సన్మానం జరిగిన సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. ఆరోజుల్లో చిరంజీవి కృష్ణారావు ఆ జిల్లాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. మాకుగల స్నేహ బాంధవ్యాలవల్ల నేను సన్మాన సంఘంవారి ఈతిథ్యం స్వీకరించక కృష్ణారావు యింట్లో మకాంవేశాను. అప్పటికి కృష్ణారావు ఏమీ వ్రాయడంలేదు. దాదాపుగా కవితా సన్యాసంచేసి కూర్చున్నాడు. ఆఅరాత్రి చాలా చాలా పొద్దు పొయ్యేవరకు సాగిన సంభాషణలో , ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో కొద్దో గొప్పో అబ్బిన కవితా శక్తిని సాధనద్వారా పదును పెట్టుకోకుండా లౌకిక వ్యవహార నిమగ్నతవల్ల దానిని గాలికి వదలి పెట్టడం ఎంత అన్యాయమో నేను వివరించాను. నాకు మొదల్నుంచి రెండు పిచ్చులున్నాయి. ఒకటి నేను వ్రాసినా వ్రాయకపోయినా కనపడిన ప్రతివాడినీ రాయమనీ ప్రోత్సహించడం, రెండవది ఆధునిక వచన గేయానికి సంప్రదాయవాదులైన కవి పండితుల మెప్పును గూడా వీలైనంత వరకు సాధించడం, ఆనాటి నా వాదన ఆయన గుండెల్లో పశ్చాత్తాప ఆనలజ్వాలలు లేపిందని నాకు తెలియలేదప్పుడు. తరువాత ఒక ఏడాది వ్యవధితో ఒకసారి మా యింటికి వచ్చి "ఇదిగో, నీవుకోరిన కావ్య"మని చేతికందిచ్చాడు. నేనా విషయం ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ అది స్పృహకు వచ్చి పరమానంద భరితుణ్ణయ్యాను. అందువల్ల యీ కావ్యము కృష్ణారావు బిడ్డమత్రమేకాదు, నా బిడ్డకూడా. పైగా నేను స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున ప్రకటించ బడుతున్నందువల్ల దీనితో నా బంధుత్వం మరీ ఎక్కువైంది. రచనలో ఎంత బద్దకం చూపాడో తత్ర్పచురణలో గూడా అంత చేయబట్టి గాని లేకుంటే ఇది ఏనాడో అచ్చు గావలసింది. సకాలంలో అచ్చయి వుంటే కృష్ణారావు యిటువంటి మరికొన్ని కావ్యాలు యీ పాటికి వ్రాసి వుండేవాడని నాకు గట్టినమ్మకం. అయినా యిప్పుడు మించి పోయిందిలేదు.


ఈ కవి యావదాంధ్రావనిని సుమారు ఒక దశాబ్దం పాటు ముంచెత్తిన అభ్యుదయ కవితోద్యమంలో పుట్టి పెరిగినవాడు. అందువల్లనే యా కావ్యంలో యితివృత్తం అధోజగత్సహోదదుల దుర్భర నిత్యజీవిత వర్ణనగా రూపొందింది. మురికి వాడల్లో నివసించే బీదా బిక్కి ప్రజల జీవితంలోని కఠోర సత్యాలను ప్రజల దృష్టికి తీసికొని రావడానికి, తద్వారా వ్యంగ్యంగా సంఘంచేస్తున్న మహాపరాధాన్ని స్ఫురింపచేయడానికి చేసిన యా ప్రయత్నం నూటికినూరు పాళ్ళు అభ్యుదయ ప్రయత్నం. ఈ మురికివాడకు తనే చెప్పినట్లు, యీ "ఒకొక్క నగరం దేహం మీద మానని రాచపుండుల"కు కవిగారు పెట్టిన ముద్దుపేరు "వైతరణి". మానవాభ్యదయానికి ఆటంకంగా యీ మహానది ప్రవహిస్తున్నదని, దారిద్ర్యానికి ఐశ్వర్యానికీ మధ్య దాటరాని సరిహద్దుగా తయారైందని బహుశా కవిగారి వూహ.


వచన కవితోద్యమానికి ప్రత్యేకంగా ఒక తత్వమంటూ ఏమీలేదని ఆనాటి అభ్యుదయ కవిత్వపు తత్వమే మరికొంత విస్తృతమైన రూపంలో యిమిడి వున్నదనీ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ప్రత్యేక తత్వంలేకుండా ఒక ఉద్యమమం ఉంటుందా? అనే సందేహం అలా వుంచుదాం. ఉద్యమం అంటున్నానంటే యిది ఒక ఉధ్యమస్థాయిలో వ్యాపిస్తూవున్నదని చెప్పడమే నా భావం. ఇప్పటికీ అభ్యుదయ కవితా తత్వమే రాజ్యం చేస్తున్నదనడానికి యీ కావ్యం మంచి ఉదాహరణ.ఉఒక దృష్టితో చూస్తే గురజాడ, రాయప్రోలులతో ప్రారంభమైన నవ్య కవిత్వ మంతా అభ్యుదయోద్యమంలో భాగమే. కొత్తనుగురించి అన్వేషించిన ప్రతి ప్రయత్నమూ అభ్యుదయోద్యమ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ జరిగిన ప్రయత్నాల్లో కూడా కొన్ని అనుకొన్నంత కొత్తను సాధించలేకపోవడం , పాతదానినే కొత్తమూసలో పోయడం వంటివికూడా జరుగుతూవుంటాయి. ప్రేమ కవితా ప్రభావితమై సాగిన నవ్య కవితోద్యమ శాఖ యిటువంటిది. ఫలితమేదైనా కొత్తకోసం జరిగిన ప్రయత్నం కాబట్టి, ఉదారంగా అలోచిస్తే అభ్యుదయ తత్వపు విశాలార్థ కిందికి తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమేమిటి, అది ప్రజలను ఎంతగా ఆకర్షించింది, ఆనందపరచింది, వారు దానినెంతగా ఆదరించారు అనే ప్రశ్నలు తర్వాత. ఆరంభంలో సరియైన దారినేరిఎంచుకొని మధ్యలో పొరపాటున అడ్డదారులు తొక్కే ఉద్యమాలు కొన్ని: కళ కళకోసమే అని నమ్మిన ప్రేమ కవులు ఎంత విఫలులైనారో, అభ్యుదయ తత్వం ఒంటబట్టి కూడా ప్రయోగం ప్రయోగం కోసమే అన్న ధోరణిలో రచనలుచేసిన ప్రయోగవాద కవులు కూడా అంతే విఫలులయ్యారు. ప్రజలకూ కవిత్వానికీ గల సంబంధం సరిగా గుర్తించనందువల్లే యీ వైఫల్యం పొందవలసి వస్తుంది. స్థూలంగా చూసినట్టయితే ఏ కాలంలోనైనా రెండే రెండు కవితా తత్వాలు వుంటాయి. ఒకటి ముందుచూపు; రెందవది వెనుక చూపు. ముందుచూపుగ కవిత్వం అభ్యుదయ కవిత్వం. అయితే ప్రతి కవీ కాలప్రభావంచేత కొద్దో గొప్పో ముందుచూపు కలిగే వుంటాడు. జరిగే మార్పుకు అతడు కూడా దోహదం చేస్తూనే వుంటాడు. అందువల్ల కవులందరికి సమిష్టి కృషిగానే సంప్రదాయం కొంచం కొంచంగా మారుతూ వుంటుంది. ప్రజల ఆమోదం పొందుతూ, వారిని తనతో పాటు తీసికపోతూ, మార్పు వస్తుంటుంది. ఈ విధంగా జరిగే మార్పు స్థిరంగా దేశంలో పాతుకుపోతుంది.


అదే సమయంలో కొందరు తీవ్రవాదులు ఒకటినుండి వందవరకు ఒకేసారి గంతేసినట్లు, ప్రజలను తమతో తీసికెళ్ళాలనే ధ్యాస వదలి తామొక్కరే ముందుకు పరుత్తారు. ఈ ప్రజలు మూఢులంటారు; తామొక శతాబ్దం ముందున్నామంటారు; యీ పాడు ఆంధ్రదేశములో పుట్టబట్టి కాని ఏ యింగ్లండులోనో పుట్టినట్లయితే తనకు నోబిల్‌బహుమతి వచ్చివుండేదని నమ్ముతారు. ఇదంతా తన దేశము, తన కాలము, తన ప్రజలను నిర్లక్ష్యముచేసి, నేలవిడిచి చేసే సాముగా తయారవుతుంది. మనకు చూడడానికి కొంత వినోదముగా వుంటుంది తప్ప యిటఉవంటి ఉద్యమాలవల్ల ఫలితమేమి వుండదు. ప్రజలను విస్మరించిన ప్రతి కవితోద్యమము ఏమైనదో సాహిత్య చరిత్ర తెలిసిన వారికి విదితమే.


గురజాడనుండి క్రమ పరిణామం పొందుతూ వస్తున్న కవితా విప్లవంలో యీ నాటికి తేలిన సారాంశమేమంటే, కవితా స్వరూపం అభ్యుదయభావన, స్వరూపంలో వచనా కవితా పద్ధతి. ఈ రెంటినీ సమర్థవంతంగా నిర్వహించడమూ నేటి కవుల కర్తవ్యం, ఈ దృష్టితో చూసినట్లయితే కవిత్వంలో కేవలం రసానుభూతి వాదన నిలవదు. ఆచరణలో అది కవితా పరిధిని సంకుచితంచేసి, కవితా వ్యవసాయాన్ని దాని యందభిమానం గల కొందరు మేధావులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అప్పుడు ప్రభంధ కవులకూ మనకూ వుండే తేడా చాలా స్వల్పం. అందుకే ఆధునిక కవిత వస్త్వాశ్రయ మార్గానికి తిరగాలని నేనంత పట్టుదలగా ప్రతిపాదించడం. సామాజిక అభ్యున్నతి సండేశంగాగల అభ్యుదయ కవిత్వానికి వస్త్వాశ్రయ మార్గమే చక్కగాఉపకరిస్తుంది. దాని విస్త్రుతికి దోహదం చేస్తుంది. ప్రభంధాలలోని వస్త్వాశ్రయత కేవలం నామమాత్రం. వర్ణనాధిక్యతవల్ల అవి దాదాపు మన ప్రేమ కవుల ఆత్మాశ్రయ కవితా భావనలకు దగ్గరి చుట్టాలుగా వున్నాయి. కాగా అనుసరణీయము భారతములోని వస్త్వాశ్రయ మార్గము.


"వైతరణి" కావ్యంలో ఒకే కేంద్ర కథావస్తువునకు సంబంధించిన వివిధ భావపరంపర ఒకదానితో ఒకటి పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో సమకూర్చబడింది. అందువల్ల వస్త్వాశ్రయ కావ్యమార్గానికి చాలా దగ్గిరలో వుంది. ఒకే విషయాన్ని గూర్చిన మనసులో భావజలధి మననంచేసి రసామృత ఖండాన్ని పుట్టించే అలవాటు చాలామంది ఆధునిక కవులకులేదు. పాఠకుని హృదయంలో రసావిష్కరణ చాలా సులభంగా జరుగుతుందనుకుంటున్నారు. లేకుంటే పాఠకులది తప్పనుకుంటున్నారు. కావ్యంలో తాను ప్రతిష్టించే వివిధ ప్రతిభాంశలచేతా, తన అనుభూతిని జగదనుభూతితో మేళవించి ప్రజల హృదయాలను చూరగొనాలనే సంకల్పంచేతా కవి కృతకృత్యుడు కాగలగుతాడు. ఆ విధమైన కావ్యాలను సృష్టించగలిగినప్పుడే ఆధునిక కవితలో వచ్చిన విప్లవం సార్థకమవుతుంది..


వచన కవితా వికాసం జరగడానికి వస్త్వాశ్రయ మార్గం అనుసరణీయమని అంఘీకరిస్తే ఆ మార్గం పూర్తిగా వృద్ధిపొందడానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వం స్థాపించిన "భావలయ" సిద్ధాంతము, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ప్రతిపాదించిన "భావగణ" సిద్ధాంతము బాగా వుపయోగపడే సాధనాలు. వీటినిగురించి యింకా స్పష్టముగా నిర్వచించవలసి వుంది. ఈ "వైతరిణి" కావ్యం "భావలయ" సిద్ధాంతానికి చక్కని లక్ష్యమని నా అభిప్రాయం.


"మండు వేసవిలో

మల్లెపూల అంగడి పెట్టినవారు

పాలబుగ్గల పసి పిల్లడికి

పనస తొన అందించినవారు" అని ప్రారంభమైన ఖండికలో కవితా శిల్ప రహస్యం చక్కగా ఆవిష్కరించబడింది. తన కథానాయకులైన మురికి పేట వాసులు తమ సహజవృత్తులను అవలంభిస్తూనే సంఘానికి ఎంత మహోపకారం చేస్తున్నారో , వారి వునికి సంఘానికి ఎంత అవసరమో వర్ణన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి ప్రయోజన కారులను మురికిపేటల్లో బధించి వుంచడం సంఘం చేస్తున్న దోషమనే వ్యంగ్యం భాషింపచేస్తూ చేసిన యీ వర్ణన మనోహరంగా వుంది. "వెలుతురుస్తంభం" అనే ఖండికలో కవి

"మహామహులు ప్రయాణంచేసే శకటాలకు అనామకులైన సారథు"లైన తన కథా నాయకులు "అన్యాయపు ఆజ్ఞలు శిరసావహించని అనుమానాస్పదులైన సైలికు"అలి కూడా చెప్పి ప్రజల్లోల్ర్ తిరుగుబాటు తత్వాన్ని స్పురింపజేసి ఒక హెచ్చరిక చేసాడు. "చీకటిలో వెలురు స్తంభం నాటించి, సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి అందరికీ వెలుగును పంచి క్రొత్త త్రోవలు త్రొక్కుతారట" తన కథానాయకులు. ఇంతకంటే కవితాత్మకంగానూ, సరళ మనోహరంగానూ ప్రజల స్వభావాన్ని వర్ణించడం కష్టసాద్యం.


చిరంజీవి కృష్ణారావు ఆధునిక తెనుగు సాహిత్యానికి పాత కాపే. ఆయనను గురించి ఎక్కువగా రాయనవసరంలేదు. కాని నాకు అభిమాన ప్రయోగమైన వ్స్త్వాశ్రయ కవితా మార్గంలో యీ ప్రయత్నం జరిగింది కాబట్టి యింతగా రాయవసి వచ్చింది. తీరికలేని ఉద్యోగపు విధులను నిర్వర్తించుకుంటూనే, సాహిత్యానికి కొంత సమయాన్ని సమకూర్చుకో గలిగితే ఆయన యింకా యిటువంటి యింతకంటే మంచి కావ్యాలు రాయగలడని నా విశ్వాసం.


కుందుర్తి

ఫ్రీవర్స్ ఫ్రంట్ , హైదరాబాదు.

25.01.1967


...౬౯౦.....

3 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల 2వ కవితా సంకలనం



నెలనెలా వెన్నెల 2 కవితా సంకలనం నవంబరు 1990లో వెలువడింది.
అందులోనుంచి సి.వి.కృష్ణారావు గారి మాట

నెలనెలా ...
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ఆగష్టు రెండవ బుధవారు నాడు ఆప్యాయతగా కలుసుకొన్న అయిదుగురం నగ్నముని, పె.ఎన్‌.స్వామి, చంద్రశేఖర్‌, కలగా వెంకట సుబ్బారావు. నాటికి వీడ్కోలు చెప్పుకొనే వేళకు కవిత్వం గురించి ఒక్కరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించలేదు. కాని అదే మాదిరిగా ప్రతినెలా ఒకసారి కలుసుకుందామని నిర్నయించుకున్నారు.

నూరు నెలలూ క్రమం తప్పకుండా కలుసుకుంటూనే ఉన్నారు. మా అయిదుగురి నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కలుసుకొనేవారి సంఖ్య 40 - 50కి పెరిగింది.

"నెలనెలా వెన్నెల" ఇప్పటికి ఇసుపరిచితమైన సాహిరతీ మైత్రీవేదికగా రూపొందింది. కవితా వ్యాసాంగంలో ఉన్న కొందరు మిత్రుల నెల కొకసారి కలుసుకొని ఒకరి రచనలు మరొకరికి వినిపించుకోవటానికి సమావేశాలు మంచి అవకాశం కలిగించాయి. ఉపనిషత్తులూ, ఉదాత్తభావాలూ, ఉద్రేకాలూ, విప్లవకవిత్వం, పద్యాలూ, వచనకవిత్వం, పాటలూ, ఒకే సమావేశంలో ఒకరిలొకరు సానుభూతితో వినగలుగుతున్నాం.

తెలుగు సాహిత్యంలో వివిధ భావకోవలకు చెందిన కవులు ఒకే వేదికపై చేరే అవకాశం తక్కువవుతున్న రోజుల్లో అందరూ కగలసిపోగల సహృదయ వేదికను కవిలోకానికి సమర్పించింది "నెలనెలా వెన్నెల". విమర్శ జరిగినా అది సహృద్భావ వాతావరణంలోనే. ఒక్కోనెల ఒక్కోమిత్రుడు సమావేశానికి ఆతిధ్యమిచ్చే సంప్రదాయం ఉంది. కనుక కవిమిత్రుల మధ్య వారి కుటుంబాల మధ్య ఎంతో స్నేహం, ఆప్యాయత ఏర్పడుతున్నాయి.

నెలనెలా వెన్నెల నిర్వహించిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి:
1985లో నెలనెలా వెన్నెలలో పాల్గొంటున్న కవిమిత్రుల కవితా సంకలనం ఒకటి వెలువరించాం. నెలనెలావెన్నెల సమావేశాల్లో మన జంటనగరాలలోని 250 మంది ఒకనెల కాకపోతే మరో నెలయినా వచ్చి కూర్చున్నవారే.

నిరుడు (1989) జూలై 31 'కవితా శిబిరం' ఒకటి నిర్వహించుకొన్నాం. ఆధునిక వచన, పద్యధుగేయ కవితలగురించి అధ్యయనం జరిగింది. సభ ఉదయం 11గంటలకు మదలై రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఇంతసేపూ చాలా ఆసక్తితో అందరూ పాల్గొన్నారు.

సంవత్సరం జూన్‌ 24 ఒక కవిసమయం కార్యక్రమం నిర్వహించుకొన్నాం. ప్రయోగంలో 21 మంది కవిమిత్రుల కవితలను వారి వారి పేర్లు లేకుండా ప్రచురించి, కవితలను విశ్లేషించవలసిందిగా ఆహుతులైన సబ్యులను ఆహ్వానించాము. కవి తాను అజ్ఞాతంగా ఉండి తన కవితగురించిన చర్చ చెవులారా వినగలగటమే ఆనాటి సవివరమైన చర్చల ఫలితం. ప్రయోగం మంచి ప్రయోజనమైనదిగా సాహిత్యభిమానులు ప్రశంసించారు.

ఇప్పుడు వెలువరిస్తున్న రెండవ సంకలనంలో కవితలు 40కి మించి ఉన్నాయి. వీటిలో సామాజిక స్పృహలూ, నిస్పృహలూ, రసాలూ, నీరసాలూ అన్నీవున్నాయి.

ఇదొక అవిరళమైన కృషిలో భాగంగానే స్వీకరించండి. కృషి మరింత నైపుణ్యం కోసం వెతుకులాట మాత్రమే.

సంకలనంలోని కవితల్లో ఏక సూత్రతలేదు. అయితే వివిధ భావాలూ, తత్వాలూ, వాదాలకు చెందిన కవిమిత్రుల ప్రతిభకు, పోకడలకూ అద్దంపడతాయి. లబ్ద ప్రతిష్టులు సాహితీ క్షేత్రంలో కొత్తగా నాగాలిపట్టిన కృషీవలులూ ఇందులో దర్శనమిస్తారు. కాని అన్ని కవితలలోనూ సామాన్య లక్షణం భావుకతా, నిజాయితీ.

-------------------------
సివి.కృష్ణారావు, 25 నవంబరు 1990. .......౬౦౯ దీనిలోని కవితలను విలువెంబడి పోస్టు చేస్తాము.
0 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల సమావేశము 28.2.2010

యదావిధిగా నెలనెలా వెన్నెల సమావేశము 28.2.2010న జరిగింది
వాడ్రేవు చిన వీరభద్రుడు వ్యాసాల సంపుటి ''కవిత్వమంటే ఏమిటీ' పుస్తకాన్ని శ్రీ కృష్ణా రావు గారికి అంకితమివ్వడం ఈ సమావేశ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, శ్రీ ధర్మాచారి, శ్రీ జాన్ హైడ్ కనుమూరి, శ్రీ రఘు, శ్రీ కె.వి. రామానాయుడు, శ్రీ యాకూబ్, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి పార్వతీమోహన్ పాల్గొన్నారు
5వ సంకలనకోసం జరిగే ప్రయత్నాలు, ఇంకా అందవలసిన మిత్రుల కవితలను గురించి చర్చించారు. చిన వీరభద్రుడు తన అనువాద కవితలను, యాకూబ్ తన ఎడతెగని ప్రౌఆణంలోచి కవితలను, ధర్మాచారి తన హాస్య, వ్యంగ్య గల్పికలను, జాన్ హైడ్ తన కవితలను, రఘు తన కవితలను, రామానాయుడు తనకవితలను వినిపించారు.
చివరిగా కృష్ణారావుగారు రెండు కవితలను వినిపించారు.






జాన్ హైడ్ ధర్మాచారి
రామానాయుడు, చినవీరభద్రుడు
రామానాయుడు, చినవీరభద్రుడు, యాకూబ్ కృష్ణారావు, రఘు, జాన్ హైడ్
కృష్ణారావు గారికి చినవీరభద్రుడు 2 కామెంట్‌లు

ఫిఎరి అండ్ ఇఎర్కె


C. V. Krishna Rao (born 1926) is a career social worker who retired as Director Backward Classes Welfare in Government of Andhra Pradesh. He is a poet, short-story writer and literary critic who wrote many a critical essay and assessment. He published four collection of poems. Vytarini deals with slums and lives of slum dwellers, Maadee mee voore with class distinctions and rifts and Avisrantam with the and rifts and Avisrantam with the leftovers of pristine of man. Killari unveils an imaginative artist’s perception of the devastation wrought by nature’s fury manifest in an earthquake. He founded the forum of poets “Nelanelavennela” of Hyderabad

0 కామెంట్‌లు

ఒక లక్ష బొటమన వేళ్ళు చదివినవాడు


కవి దేవతలను ఆవాహన చెయ్యగలడు, కాని విపత్తుయెదుట మూగబోతాడు. వీరుడొక్కడే విపత్తుని ఎదుర్కోగలవాడు. దానితో ముఖాముఖీ, బాహా బాహీ తలపడగలవాడు. కనుకనే భౌతిక విపత్తులు, ఆకలి, కరువు, యుద్ధం, ఉప్పెన, తుఫాను, అశనిపాతం సంభవించిన ఏ సందర్భంలోనయినా ముందు వీరులు పుడతారు. ఆ తరువాతే ఆ వీరుల్నిదేవతలుగా స్తుతిస్తూ కవులు పుట్టేది.
ఇందుకేమైనా మినహాయింపు ఉందా అంటే ఉందనాలి. వీరుల్లాంటి కవులూ, కవుల్లాంటి యోధులూ ఎక్కడయినా ప్రభవిస్తారా అంటే ప్రభవిస్తారనే అనాలి. ఎక్కడిదాకానో ఎందుకు మన గరిమెళ్ళ సత్యనారాయణ, సుద్దాల హనుమంతు, సుబ్బారావు పాణిగ్రాహి, చెరబండరాజు, శివసాగర్‌, గద్దర్‌, ఇప్పుడు దామూ - మనది ధన్యభూమి కనుక ఈ కోవకి అంతంలేదు.
ప్రజాకవులొక్కరే విపత్తు జుట్టు పట్టుకొని దాని మెడలు ఒంగదీసి "కురువృద్దుల్‌, కురుబాంధవుల్‌ చూచుచుండగ" ఎలుగెత్తి తమ శాపాల్నీ, శపథాల్నీ కుమ్మరించగలరు. ప్రజాకవిత వీరకవితా సంప్రదాయం - దాన్ని పాటకో, పదానికో పరిమితంచెయ్యలేం. ఈ చిన్ని సంపుటంలోని వచనాల్ని చదివిన వారికి ఈ విషయమే బోధపడుతుంది. అజ్ఞాతుడయిన ఏ రాయలసీమ ప్రజాకవి వీరుడో ఎన్నడో 'ధాతకరువు'పైని పాడిన విషాదభరిత గీతాన్నొకసారి ఆమళ్ళదిన్నె గోపీనాథ్‌ గారు వినిపించగా విన్నాను. ఆనాడు నే పొందిన బాధామయస్పురణని తిరిగి ఈ కవితల్లో కన్నాను.
చాలా యేళ్ళ కిందట తన గురించి కృష్ణారావు గారు ఇలా రాసుకున్నారు.
"వాళ్ళు .... గుడిశముందు మురికి గుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే సగంచెప్పి సగంచెప్పక పూర్తిగా బాధ చెప్పటానికి మాటలురాక అర్జీ రాసికోవటానికి యిళ్ళల్లో కాగితంలేక చేతుల్లో కలాలు లేక ఏకలవ్యుల్లా నాకు వారి బొటిమన వేళ్ళీచ్చారు. ఒక లక్ష బొటిమన వేళ్ళూ నేను వ్రాసాను - చదివాను. ముదుసళ్ళవీ, వయస్కులవీ, స్త్రీలవీ, పురుషలవీ, ఆరోగ్యవంతులవీ, పాపలవీ, వీరులవీ .... (వైతరణి - 1968)"
శిష్ట సంప్రదాయానికి చెందిన కవి పూర్వకవి సమయాలను బాగా అధ్యయనం చేస్తాడు. కానీ ప్రజాసంప్రదాయానికి చెందిన కవి లక్ష బొటిమన వేళ్ళను చదువుతుంటాడు, పోల్చుకుంటాడు. కృష్ణారావుగారు వచన మార్గానికి చెందిన ప్రజాకవి. ఎన్నో రోజులుగా ఈ కవితల్తో నేను కలిసి గడిపిన మీదట ఇప్పుడు చెప్పగలిగింది ఇదే. బాదా సందర్బాన్ని మనం మర్చిపోవాలనుకుంటాం. కానీ కవి గుర్తుచేస్తాడు. మనవంటి మందమతులకి తిరిగి తిరిగి గుర్తుచేసే ఈ బాధ్యతని నెత్తికెత్తుకున్నందుకు కవిది నిత్య బాధా సందర్బం. మన బాధా, తన బాధా అందరి బాధా తనే పడుతున్న తల్లిలాంటి, భూమిలాంటి కవి మన ముందుకు వచ్చినపుడు ఇకనైనా జాగు చెయ్యక వెంటనే పోల్చుకుందాం.
వాడ్రేవు చినవీరభద్రుడు.
హైదరాబాదు, 18.7.1996
-----
1993 సెప్టెంబరు 30వతేదీ రాత్రి లాతూర్‌, ఉస్మానాబాద్‌(మహారాష్ట్ర) జిల్లాల 69 గ్రమాల్లో భయంకరంగా భూమి కంపించిన సందర్భంలో కవిగా స్పందించి, ప్రదేశాలను దర్శించి, అక్షరీకరించి "కిల్లారి" పేరిట 1996లో మనముందుకొచ్చింది. 1 కామెంట్‌లు

ఫిబ్రవరి ౨౦౧౦ నెల నెలా వెన్నెల

2 కామెంట్‌లు

నెలనెలావెన్నెల సమావేశాలు photos




 
Posted by Picasa

శ్రీ ధర్మాచారి, శ్రీ అద్దేపల్లి, శ్రీమతి శిలాలోలిత
శ్రీ సి.వి.కృష్ణారావు, శ్రీ ప్రసాద్, శ్రీ ఒబ్బిని 6 కామెంట్‌లు

సమావేశాలు



0 కామెంట్‌లు

డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారి 2003 పురస్కారలు




0 కామెంట్‌లు

జనవరి నెల సమావేశ విశేషాలు

31.1.2010 ఆదివారము సాయంత్రం జరిగింది
హాజరైన వారు
శ్రీ ఒబ్బిని సన్యాసిరావు
శ్రీ ధర్మాచారి
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి దావులూరి విజయలక్ష్మి
శ్రీమతి రేణుకా అయోలా
శ్రీమతి శిలాలోలిత
శ్రీ యాకూబ్
శ్రీమతి పార్వతీ మోహన్

స్వీయ కవితా పఠనము ఓబ్బిని తో మొదలయ్యి, ధర్మాచారి గల్పికలు, శిలాలోలిత, రేణుకా అయోలా, జాన్ హైడ్ కనుమూరి కవిత్వాన్ని చదివారు.
యాకూబ్ తన కొత్త సంపుటినుండి కొన్ని కవితలను వినిపించి అందరికి అందజేసారు.
డావులూరి విజయలక్ష్మి తన కథల పుస్తకాన్ని అందించారు.
నెల నెలా వెన్నెల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను, విశేషాలను ఉటంకిస్తూ పార్వతీ మోహన్ రాసిన వ్యాసాన్ని, యాకూబ్ చదివి వినిపించారు. అది త్వరలో బ్లాగులో రానుంది మరిఉ సంకలనంలో రానుంది. ఆ వ్యాసంలోని పలువురు వ్యక్తుల పేర్లు వింటున్నప్పుడు వారిగురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కొందరు. కోదరు మన మద్యలేరు అనే జ్ఞప్తి కొచెం బాదించినా వ్యాసంగా రావటం సాహిత్య నికి అవసరం ఎంతానావుందని అందరూ అభిప్రాయపడ్డారు.
నెలనెలా వెన్నెల అనేక సాయంకాలల పేరుతో ఇప్పటివర్కూ నాలుగు సంకలనాలు వెలువడ్డాయి. ఐదవ సంకలనకోసం చేస్తున్న ప్రయత్నాలగురించి చర్చించారు.
యాకూబ్ తనవంతు సహకారాన్నివ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన కవితలను, ఇంకా రావలసిన వాటికోసం మిత్రులతో మాట్లాడలని అనుకున్నారు.
బ్లాగు విషయాలను జాన్ హైడ్ తనవంతు సహకారాన్ని ఇవ్వడంకోసం ముందుంటానన్నారు. 2 కామెంట్‌లు

నెలానెలా వెన్నెల సమావేశము ౩౧.౧.2010

0 కామెంట్‌లు

నెలనెలా వెన్నెల - బ్లాగు పరిచయం

గత మూడు దశాబ్దాలుగా నెలనెలా వెన్నెల పేరుతొ సాహితి మిత్రులను ఒకచోట కలుపుతున్న శ్రీ సి.వి. కృష్ణారావు నడిపిస్తున్న సాహితీ మిత్రుల కలయిక విశేషాలను పరిచయం చెయ్యాలనే వుద్దేశంతో మొదలుపెడుతున్నాము.
మీ ప్రోత్సాహాన్ని, నెలనెల వెన్నెలతో మీకు అనుబంధముంటే అనుభవాలను, మీ అభిప్రాయాలను తెలియచేయండి.
వేగు పంపండి
cvkrao1926@gmail.com

ఈ నెల సమావేశము ౩౧.౧.౨౦౧౦ సాయంకాలము ౫.౦౦ గంటలనుండి
చిరునామా
సి.వి. క్రష్ణా రావు
౧౦౩, బాబు టవర్స్
౧-౬-చైతన్యపురి
హైదరాబాదు - ౫౦౦ ౦౬౦
దూరవాణి ౨౪౦౪౪౨౬౨
24044262 2 కామెంట్‌లు