సమకాలీన సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో చెరిగిపోని అడుగుజాడలు సృష్టించిన సాహితీవేత్త కృష్ణారావు
శరత్కాల సాయం సంధ్య పున్నాగ పూల పరిమళాలతో గాలులు తెరలు కడుతున్నాయి. నగరాకాశం మీద చంద్రుడుదయిస్తున్నాడు. హోటల్ వైస్రాయ్ కాన్ఫరెన్స్హాల్లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కార సభ. హాలంతా డాక్టర్ కె.ఆర్. సూర్యనారాయణ వీణానాదంతో పులకిస్తోంది. పురస్కారాలందుకున్న వాళ్ళలో సి.వి. కృష్ణారావు కూడా ఉండడం ఆనాటి ఆనందానికి మరింత వన్నె తెచ్చింది.
సి.వి.కృష్ణారావు(1926) జీవితకాలపు కృషి కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితమయింది కాదు. ఆయన జీవితం పేదవాళ్ళకూ, తరతరాలుగా సాంఘికంగా అణగారుతూ వస్తున్న వాళ్ళకూ ఒక ఓదార్పుగా, ఒక వాగ్దానంగా, ఒక బాసటగా ఉంటూ వచ్చింది. ఆయన విద్యార్థి రోజుల్లో నిషేధిత సోషలిష్టు పార్టీ తరపున అరెస్టయి జైలుకు వెళ్ళినవారు. దాసరి నాగభూషణరావు దగ్గర కమ్యూనిష్టు పాఠాలు నేర్చుకున్నవారు. సాంఘిక సంక్షేమ శాఖలో సాంఘిక సేవా కార్యకర్తగా అదిలాబాదునుంచి తూర్పు గోదావరి మన్యసీమల దాకా ఆయన చూడని దళితవాడ, అడుగుపెట్టని గిరిజన గూడెం లేవంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికి పాతికేళ్ళూ పైబడ్డ మాటే. తూర్పుగోదావరి జిల్లాలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా ఆయన మా గిరిజన గ్రామాలకి వచ్చారు. మా పల్లెల్లో సాధారణ రెవెన్యూ ఉద్యోగులు కూడా ఎంతో అధికార ధర్పం ప్రదర్శించే ఆ రోజుల్లో ఆయన ఆదివాసుల్ని పేరు పేరునా పలకరిస్తూ వాళ్ళతో అడవి అంచుల్లో పొలం గట్లమీద కలిసి నడుస్తుండేవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూలు కులాలు, షెడ్యూల్తెగల అభివృద్ధికి, సంక్షేమానికీ కొత్తదారులు వేసిన తొలితరం కార్యకర్త. ఆయన. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు అలిఖిత ఒరవడి ఆయనదే. అందుకనే జి. ఫణికూమార్ తన గోదావరి గాధలకు పరిచయంకోసం కృష్ణారావును అభ్యర్థించారు.
ఉద్యోగ, వైయక్తిక, సృజనాత్మక జీవితాలు వేరు వేరు పరిధిల్లో సంచరించే మనుషుల మధ్య కృష్ణారావు లాగా తన అన్ని వ్యాసాంగాలకూ కేంద్రాన్నొకటిగానే ఉంచుకొనేవాళ్ళు అరుదు. ఆయనకు హరిజనులతో సాంగత్య, సామీప్యం కేవలం ఉద్యోగ జీవితానికే పరిమితం కాలేదు. బహుశా జాషువా తరువాత, సామాజిక అసమ్మతి స్వరాన్ని అంత బలంగా సమాజం ఎదుట లేవనెత్తింది కృష్ణారావు అనొచ్చు. అందుకు సజీవ సాక్ష్యం వైతరిణి(1968) కావ్యం. అది కావడానికి 16 కవితల చిన్న కావ్యమే అయినా వస్తువులో, అభివ్యక్తిలో అది నిస్సందేహంగా అభ్యుదయానంతర యుగానికి మేలుకొలుపు. అత్యంత సరళమైన, నిష్కపటమైన, ప్రజాస్వామిక సంస్కృతిలో కూడిన రచన అది. 'మానవులు మాలిన్యం చేసే చోట్లను ఒర్పుల చీపుర్లతో తుడిచిన' రచన అది. తిరిగి తొంబైల్లో దళిత కవిత్వం ప్రధాన సాహిత్య చైతన్యాన్ని ఆకట్టుకునే దాకా అటువంటి రచన తెలుగులో రాలేదనే చెప్పాలి. యథార్థినికి మాదీ మీ ఊరే (1959) ఆయన మొదటి ప్రచురణ అయినా, ఒక ఏడాది ముందే వైతరిణి తన మనసులో రూపుదిద్దుకుంటూ ఉండేదని ఆయన ఒకసారి అన్నారు..
మధ్యలో అవిశ్రాంతం (1991) తరువాత ఆయన వెలువరించిన కిల్లారి (1996) ఆధినికానంతర యుగానికి వేకువ కేక. ఇంకా తెలుగు కవిత్వం ఆధునిక నిర్మాణాల్ని చూడలేకపోతున్న సమయంలో ఆయన కవిత్వాభివ్యక్తిలో మౌలిక పరివర్తనను తీసుకువచ్చారు. తన కాలం కన్నా ముందుండగలగడానికి ప్రథాన అర్హత తన హృదయమెప్పుడూ జ్వలిస్తుండడమే.. ఆ హృదయ ప్రజ్వలనానికి కిల్లారి కావ్యంలో ప్రతీ పంక్తీ సాక్ష్యమిస్తుంది. అంతే కాదు, అది తన ఇంట్లో నీడపట్టున కూర్చొని , భూకంపంవల్ల నిర్వాసితులైన అక్కడి కుటుంబాలకు తన హృదయాన్ని ఊతమిచ్చి రాసిన కవిత. అందుకే డాక్టర్సుమనశ్రీ 'నీ ఆదర్శాలు నా కనవసరం, నీ ఆచరణని చూపమంటుంది ఉత్తరాధునికత'అని రాశారు. ఆ మాటలు రాయడానికి స్ఫూర్తి కృష్ణారావే అని నేననుకుంటాను.
బాధ్య కలిగిన అధికారిగా, వచన మార్గానికి చెందిన ప్రజాకవిగా కృష్ణారావు అందించిన సేవలకన్నా మరెంతో అమూల్యమైన సేవ ఆయన గత ఇరవయ్యేళ్ళుగా నెలనెలావెన్నెలద్వారా సాగిస్తున్న కృషి, 1982నుంచి నేటిదాకా ప్రతినెలా చివరి ఆదివారం ఆయన ఇంట్లో కొందరు సాహిత్యాభిమానులు జమకూరుతున్నారు. వాళ్ళందరికి తమ తమ కొత్త కవితల్ని అక్కడ చదివి వినిపించడమే అజెండా. సైద్ధాంతిక నిబద్ధత కన్నా తన అనుభూతికీ, తన బుద్ది వ్యాపారానికీ లొంగకుండా తన హృదయాన్ని చీల్చుకొని పైకొచ్చే అభివృద్ధికే ప్రధాన్యాన్నివ్వాలకునే కవులకు నెలనెలా వెన్నెల ఒక మద్దతు. అలా కృష్ణారావు నిబద్దుడని కాదు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు "కళాత్మక వ్యాసాంగానికి సంఘజీవితంలో ఉన్న రక్తమాంసాల్ని పంచుకోవడంలో అవినాభావ సంబంధం ఉంది. లేకపోతే ఉత్త సాహిత్య వ్యాసాంగం నరంలేని వేలు".
ఇక్కడ చూడాల్సింది కృష్ణారావు నిబద్ధతను వదులుకోకుండానే సాహిత్య విలువల కోసం ప్రయత్నిస్తుండటం. నిబద్ధతను యాత్రికంగా విధించడంగానీ లేదా అంగీకరించడం గానీ రెండూ జీవితాన్ని, మానవ సంబంధాల్నీరుకున పెడతాయి. ముఖ్యంగా సృజనాత్మక వ్యాసాంగాన్ని అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాకాక సృజనాత్మక కృత్యాద్యవస్థలో మనం సాధకుడి వెంట ఉండి అతని స్ఫూర్తినిస్తున్న దర్శనమేదో తనదైన పద్దతిలో తాను వ్యక్తీకరించగలిగే విధంగా అతనికొక అవకాశాన్ని వదిలామనుకోండి అప్పుడతనొక అడుగు ముందుకు వెయ్యగలుగుతాడు. తాను దేనికి నిబద్దుడిగా ఉండాలో తానే ఎంచుకోగలడు. పిట్టలు రెక్కలొచ్చి తమ దోవన తాము ఎగిరి పోయేదాకా నీడానిచ్చే వెచ్చనిగూడులా, ఒక లాంచింగ్పాడ్లా ఎందరో యువ కవులకు నెలనెలా వెన్నెల ఉపకరించిందనడం ఒక సాహిత్య యథార్థం.
నెలనెలా వెన్నెల గురించి కృష్ణారావుకున్న స్పష్టత ఆయన మాటల్లోనే చూడొచ్చు "నెలనెలా వెన్నెల్లో ఎవరి వ్యక్తిత్వవికాసం వారిది. సభ్యత్వం లేదు, చందాలు లేవు, ఇందులో పాల్గొనేవారందరూ వర్తమాన యుగ స్పందన గలవారే. ప్రచారంతో సంబంధం లేకుండా కవిత్వాకర్షణే ధ్యేయంగా పెట్టుకుని ఇక్కడకు వస్తారు. ఇంకో ధ్యాస ఏదీ లేదు. అత్యాధునిక కవితా వ్యాసంగం, కవితా చర్చ నేటి ప్రముఖ విషయాలు, చిన్నపిల్లల దగ్గరనుంచి ఇప్పటికే పేరొచ్చిన కవుల వరకూ నెలనెలా వెన్నెల ఒక కలయిక క్షేత్రంగా ఉంది" అన్నారాయన. నేనిప్పటికీ ఏ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా కృష్ణారావు అడుగు జాడల్ని పోల్చుకుంటూనే ఉంటాను. ఆ అడుగు జాడలు సమకాలీన సాహిత్య సాధనా క్షేత్రంలో కూడా అంతే స్పష్టం. నీ డేరాలోంచి నీ తల బయటపెట్టకు/ఈ సారి నీ ఆయుధం బయటపెట్టు అన్నాడాయన.
వాడ్రేవు చినవీరభద్రుడు
ఇండియా టుడే ... 4 నవంబరు 2008