RSS

వైతరణి

వైతరణి
ఒక్కొక్క నగరం దేహం మీద
మానని రాచపుండులా
వేదన హృదయంలో ఒత్తిగిలక
వెలికి వచ్చిన ఒక చిహ్నంలా
మూలకొక్క మురికిపేట
వేలకొలది జనుల విషాద గాధ

బురదలో పురుగులు మసలినట్లు
ఎన్నడూ మోములెత్తి మిన్నువైపు చూడక
వేడికి ఎండి చలికి స్రుక్కి
గాలికి వాలి తుఫానులో తృళ్లిపడి
ఈబంధన సత్యమని
ఈ బ్రతుకు అనిత్యమని
బాధల మహాభారతంలో
మురికిపేటలో మసలే మూగజీవాలు

గుడిసెల చూరు భూమికి జాగిలపడి
తమ సంపాదన
వేదనతో రోదించే శిశువుల
పెదిమలు తడపజాలని సలిల బిందువులై
రోగాలు వేగంగా మోసుకొచ్చే
క్రిమి కీటకాలు సహగాములై
తమ స్వప్నావస్థలో
కంకాళాలు నింపుకొస్తుంటే
జీవన వ్యాపారం అక్కడా జరుగుతూనే వుంది

స్మశానాలకు చోటు విడమర్చి
భయపడి పక్కకు తొలిగిన హర్మ్యాలు
తమ నగరంలో
సజీవ మానవాస్థిపంజరాలు మసులుతుంటే
ఇంకా ఎటూ కదలటంలేదు

మానవుడు చూడని లోకంలో
ఈ భువినే నిర్మించాలని
చేసే ప్రోద్బలన
ఆకసమంటే హర్మ్యాలు
యమలోకం త్రోవలో వైతరణి
మురికి పేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

వైతరణి ఒడ్డున
బాధకు చిహ్నాలై
సుప్రసిద్ధ గాధలకు నాయకులై
ఒకడు గుహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు
ఒకడు బంధువు


నివాసం = కుటీరంలో - తుఫానులో
ఆశ = ఆరుతూ - వెలుగుతూ
విశ్వాసం = వికసిస్తూ - హ్రస్వమౌతూ
ఓర్పు = ఘనీభవిస్తూ - ఆవిరౌతూ
బ్రతుకు = దు:ఖంలో - నిర్వీర్యతలో.



(వైతరణి - కావ్యం 1968 ఫ్రీవర్స్ ఫ్రంట్‌ ప్రచురణ నుండి)



2744 1 కామెంట్‌లు