RSS

రేణుక అయోల కవిత


కొన్ని సందర్భాలు వాటికవే సందేహాలుగా మారి పోతాయి
సందర్భమే మనిషిని పెనవేసుకుని జ్జాపకంగా మిగిలి పోతుంది
జనం మధ్యలో మనం మనకి మనమే అపరిచితులం

పరిచయం లేని ముఖాల మధ్య ఒంటరిగా
రోజు నడిచే దారులు నిత్యం చూసే వస్తువులు
ఏవి సొంతం కాని సందర్భాలు
ఏదో సందర్భంలో ఒక ముఖం మనకి చేరువ అవుతుంది
ఏ సందర్భం లేకుండానే మనసులో ప్రతిష్టింపబడుతుంది
దాన్ని గుండెల్లో మోస్తూ అలోచనల్లో పెనవేసుకుంటూ

ఆ ముఖం  సందర్భం కోసం వెతుకుతుంటాము
నడిచే దారిలోనో కదుల్తున్న బస్సులో
మనకిష్టమైన ముఖం మెరుపులామెరుస్తుంది
జ్జాపకమై మెలిపెట్టే ఆ ముఖం  కనిపించిన సందర్భం

ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్నిస్తుంది
అనామకం అపరిచితం
అయినా మనం కోరుకున్నది
ఊహల్లో చిరునామా లేని ఉత్తరం
ఆ ముఖంకోసం ఎన్ని సార్లు పోస్టు చేయబడిందో
సందర్భం కాని సందర్భంలో ఆ ముఖ పరిచయం కొన్ని క్షణాలు

ఏ కారణం లేకుండా వెంటాడిని రోజులెన్నో
సంఘటనలాంటి ఇలాంటి సందర్భాలు
జ్జాపకాల పోరల్లో మరుగున పడిపోతాయి
మళ్ళీ ఎప్పుడో ఏ సందర్భంలోనో
రాయితాకిడికి కదిలిన నీటి వలయాలై చుట్టుకుంటాయి.
---------------
నెలనెలావెన్నెల అయిదవ సంకలనం (2010)నుండి
0 కామెంట్‌లు