RSS

ఈ పెద్ద నగరంలో సేద తీరడానికి ఎన్ని చెట్లున్నాయో ?

ఈ పెద్ద నగరంలో సేద తీరడానికి ఎన్ని చెట్లున్నాయో ? . ఆ లెక్క నాకు తెలియదు . కానీ ఓ కవుల చెట్టు గురించి కాసింత ముచ్చటించాలి. మొన్నటి వరకు కవిత్వం రాసే లక్షణాలుండి తన చెంత చేరిన ఏ యువకుడైనా కవి కావడానికి ఆ చెట్టు ఓపిగ్గా మెరుగులు దిద్దుతూ ప్రోత్సహించేది . కవులకు , కవిత్వ శ్రోతలకూ ఆధారమైన వేదికగా మారేది . ఇట్లా యాభై ఏళ్ళు అట్లాంటి పని చేసింది . ఇప్పుడు ఆ చెట్టు పండు మక్కింది .

నేను చెబుతున్న ఆ కవుల చెట్టు పేరు సి.వి.కృష్ణారావు . ఆయన ఇప్పుడు 90 ఏళ్లకు దగ్గరలో ఉన్నారు . కవి ం.శ్. నాయుడు, నేనూ నిన్న వెళ్లేసరికి భూతద్దం సహాయంతో ఆలూరి భైరాగి పుస్తకం "నూతిలో గొంతుకలు" పడుకుని చదువుతున్నారు. ఆదివారం కాబట్టి ఇంటి పక్క చెర్చీ నుండి వస్తున్న ప్రార్థనలను "ఎర్ర క్రీస్తు " రాసిన భైరాగికి కూడా వినిపిస్తున్నారేమో ? ఎవరైనా ఆయనను చూడడానికి వెళితే మనం ఈ దృశ్యాలను చూడొచ్చు : కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా తాపత్రయపడుతూ పుస్తకం చదువుతుండోచ్చు . లేదా పుస్తకానికి అట్టలు వేసుకుంటూ ఉండొచ్చు . వేసిన అట్ట మీద రంగు రంగుల స్కెచెస్ తో ఆ పుస్తకం పేరు రాసుకుంటారు .

అవసరమైతే దానిలో నచ్చిన నోట్స్ పక్కనే రాసుకుంటారు. తన గది కిటికోలోంచి పడుతున్న వెలుగుతో ముచ్చటిస్తుంటారు. పుస్తకాల మీద ఉన్న డస్ట్ ని తూడుస్తుంటారు . విరిగిన కూర్చీకి నవారా చుడుతుంటారు . ఏవైనా కవి పక్షులు వచ్చి తన మీద కాసేపు వాలి పాడుతాయేమోనని ఎదురు చూస్తుంటారు . చెవులు సరిగ్గా వినపడకపోయినా చిన్నా పెద్దా లేకుండా తెలిసిన మిత్రులకు ఫోన్ చేస్తుంటారు . ఎదుటి వారు ఏమి చెబుతున్నారో అర్థంకాకున్నా సమాదానాలను తానే ఊహించుకుని సంబరపడిపోతారు . ఈమేల్స్ , ఫేస్బుక్ కాలంలో కూడా చేతు సరిగ్గా సహకరించక పోయినా పోస్ట్ కార్డ్ ఉత్తరాలు రాస్తుంటారు . గంగిరెద్దు వాళ్ళు పాట పాడుతూ ఇల్లు దాటిపోతుంటే ఇంతకుముందులాగా ఇచ్చినట్లుగా పాత అంగీలు , కొన్ని పైసలు ఇప్పుడు ఇవ్వలేకపోవడానికి శరీరం సహకరించలేకపోతుందే అని ఫీల్ అవుతారు .

మనం అయన దగ్గరికి వెళ్లామే అనుకోండి ఇవి అనుభవిన్చోచ్చు: లేవడం చాతకాకున్నా లేచి రిసీవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు . 360 డిగ్రీల కోణంలో తన నవ్వుని మనస్పూర్తిగా నవ్వి మన మనసుకు సుగంధాల్ని పూస్తారు . మనం అడవిలో ఏ యోగి దగ్గరో వున్నామోనన్న ఫీల్ అప్రయత్నంగా కలిగిస్తారు . మనం మాట్లాడేది మన పెదవుల కదలికను బట్టి పసిగట్టడానికి ప్రయత్నిస్తారు లేదా పేపర్ పెన్ను ఇచ్చి రాయమంటారు . మిగితా మిత్రులు ఎలా వున్నారోనని వాకబ్ చేస్తారు . ఇంతకుముందు లాగే ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడని , ఇదిగో మన X వచ్చాడు , మన Y వచ్చాడు వారికి కాఫీ తీసుకరా ! అని అనబోతారు . కానీ ఇప్పుడు ఆవిడకి కూడా లేవలేని అనారోగ్యం కాబట్టి పిల్లలను పిలుస్తారు . ఆవిడకు కూడా 80 ఏళ్ళు పైనే . వారి గది నిండా వెదికితే ఏముంటాయి ? రెండు చిన్న పాత మంచాలు. రేకు పైన కనిపించే ఆ ఇద్దరివి నాలగైదు జతల బట్టలు, రెండు కూర్చీలు, కొన్ని పుస్తకాలు . ఎంత సౌకర్యంగా వున్నారంటే వారి గదిలోకి ఇంకేం వచ్చినా ఇరుకు ఫీల్ అవుతారేమో . మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పకనే చెబుతున్నట్లుగా అనిపించింది .

ఈయన ఎంతో కొంత మాట్లాడలనుకుంటారు కానీ వినపడదు. ఆమెకు వినపడుతుంది కానీ ఎక్కువగా మాట్లాడలేదు. అలా నిశ్శబ్దాన్ని తాగుతున్నారు . అద్భుతమైన ముని జంట . వాళ్ళ గది నిండా తెల్లటి కాంతి . వాళ్ళ గది నిండా కనిపించని గాయకుడు పలుకుతున్న సన్నటి రాగం . ఎంత జీవితం చూసారో . ఎన్ని చేసారో . నిండుగా ఉన్నారు . ఆయనని ఓ తెల్లటి, పలుచటి ముడుతల చర్మం దుప్పటి కప్పినట్లు కనిపిస్తుంటుంది. తన చేతులతో మనల్ని దగ్గరకు తీసుకుని చేతులు తడిమి తన చల్లదనాన్ని ప్రసారం చేస్తారు.

ఒకప్పుడు ఆయన గిరిజన శాఖలో ఆయన ఉన్నతాధికారి గా పనిచేసారు . రాష్ట్రమంతటా ఆయన తిరుగని గిరిజన గూడెం లేదని , అలా అంతగా తిరిగిన వారు ఇంకెవరూ లేరని ఆ శాఖలో పనిచేస్తున్నఅధికారి , కవి వాడ్రేవు చినవీరభద్రుడు గారు అప్పుడప్పుడు అంటుంటారు . ఏ తరగతి మనష్యులనైనా ఆత్మీయంగా హత్తుకుంటారు ఆయన . అందుకే కృష్ణారావు గారు అంతటి ప్రజల మనిషి కాబట్టే ప్రజా IAS ( రిటైర్డ్ ) అధికారులైన S.R.Shankaran , K.R Venugopal , Kaki Madava Rao గార్లకు ఇష్టుడైన అధికారిగా అయ్యారటా. సర్వీస్ అయిపోయిన ఎన్నో ఏళ్ల తరువాత కూడా మొన్న అంతే ఇష్టంతో K.R Venugopal గారు పొత్తూరి వెంకటేశ్వర్ రావు గారిని వెంటేసుకుని ఆయన ఇల్లు వెతికి వెతికి కేవలం చూసిపోడానికే కలిసారటా .


సహజంగానే ఆయన కవి . వైతరణి నుండి కిల్లారి వరకు కొన్ని కవిత్వ పుస్తకాలు రాసారు . ఓవుత్సాహికులైన కవులకు , లేదా లబ్ధప్రతిష్టులైన కవులకు ఆయన ఇల్లు ఎప్పుడూ ఓ వేదిక . దాదాపు 600 పైన కవి పక్షులు ఎదో ఒక సమయంలో ఆ నెలనెలా వెన్నెలలో రస విహారం చేసాయి. ప్రతి నెలా చివరాకరి ఆదివారం నెలనెలా వెన్నెల పేరుతొ దాదాపు 50 ఏళ్ళు దాన్ని నడిపారు . ఉద్యోగరీత్యా ఆయన కాకినాడ వెళ్ళినా , వరంగల్ వెళ్ళినా , హైదరాబాద్ వచ్చినా ఎక్కడా దీన్ని ఆపలేదు . కాలోజి , కుందుర్తి లాంటి తొలితరం వచన కవులు , అప్పటి కొంత మంది దిగంబరకవులు , కొంత మంది విప్లవ కవులు, ఇంకా రకరకాల వాదాలను వినిపించే కవుల వరకూ ; నేడు సీనియర్ కవులు అని పిలవబడుతున్న వారి వరకూ ; సిరివెన్నల సీతారామశాస్త్రి, అందెశ్రీ లాంటి పాట కవులతో సహా ం.శ్. నాయుడు , విజయ్ కుమార్ లాంటి యువ కవుల వరకు ఏదోరకంగా ఆ చెట్టు మీద సేద తీరినవారే . ఆ కవిసంగమంలో ఈదినవారే . వారి నెలనెలా వెన్నెల్లో ప్రపంచ సాహిత్యం ప్రవహించడం నేను కూడా చూసా .

ఆయన సమాజసేవ , సమాజమార్పు అనే పెద్ద పెద్ద పెద్ద పదాలు వాడలేదు . కావాలని సందేశాలూ ఇవ్వలేదు . కానీ తానున్నమేర వూడ్చుకుంటూ హృదయమున్న మనిషిలా బతికారు . అందుకేనేమో 80 ల్లో అనుకుంటా ఆయన వరంగల్ జిల్లా ఏటూర్ నాగారం ఏరియా అడవుల్లో గిరిజన అధికారిగా పని చేస్తున్నపుడు ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేస్తున్నారటా. కొంత దూరంలో మాటు వేసిన ఆ ఏరియా నక్సలైట్ ముఖ్య నాయకుడు తన దళసభ్యులతో వస్తున్న ఆ ప్రభుత్వ వాహనంలో కృష్ణారావ్ గారు ఉంటే పేల్చకండి వేరే ఎవరున్నా ఆ వాహనాన్ని మాత్రం పేల్చండి అన్నారటా . వచ్చిన వారు కృష్ణారావ్ గారిని చూసి పేల్చకుండా వెనుతిరిగారటా . ఇంతకంటే చెప్పేదేముంటుంది .

ఇప్పుడు ఆ చెట్టు హైదరాబాద్ లోని చైతన్యపురిలో తన గదిలో పండు మక్కిన పసుపు పచ్చ జామ పండులా , హాయిగా ఏవో నేమరువేసుకుంటుంది . తనకు పరిచయం ఉన్న ఆ పాత పక్షులోచ్చి తన మీద కాసేపు వాలిపోతే నవ్వుతూ ఇంకా పచ్చగా మెరిసిపోతుంది . కలసినవారి ముఖంలో వెలుగు నింపుతుంది .
( Note : Sorry pics are blurred . Photos taken without preparation . We used very ordinary cheap cell phone to take these pics. )

Courtesy : Ganga Reddy A


5 కామెంట్‌లు