RSS

వాడ్రేవు చినవీరభద్రుడు - జాన్ హైడ్ కనుమూరి - పద్యం



వాడ్రేవు చినవీరభద్రుడు   పద్యం


తెల్లవారు జామునే నువ్వొక బల్లముందు కూచుంటావు,పక్షి ఈక ఒకటి
బంగారు రంగుది,గాల్లో ఎగురుకుంటూ యూకలిప్టస్ కొమ్మలమీద వాలే
దృశ్యం, తూలికాతుల్యమైన ఆ బరువుకి చెట్టంతా నునులేత తిమ్మిరి,
ఆమె నడుముచుట్టూ కొనవేళ్ళతో నువ్వు మీటుకునే సంగీతం లాంటిది.

వాళ్ళు రోజంతా ప్రభుత్వం కోసం పథకాలు రచిస్తుంటారు, ప్రజల కోసం
కాదు, అక్కడ నీకు ఊపిరాడదు, బయటకి చూస్తావు, రొప్పుతున్న
నగరం నీ మీద చిమ్ముతున్న సిమెంటునురగ. పార్కు గోడలమీద
ఒలికిన ఆకుపచ్చనిరంగుతో నీ మరకలు తుడుచుకోవాలనుకుంటావు.

రాత్రవుతుంది, ఒక గుడ్డతో ఆకాశాన్ని శుభ్రంగా తుడిచి బల్లమీద
చంద్రుణ్ణి తెచ్చి పెడతారు, పక్కన అద్దంలాగా చిన్ని మేఘమొకటి,
ఒక్కసారిగా నీ సౌందర్యం నీకు స్ఫురణకొస్తుంది, కవి చెప్పినట్టు
ప్రతి రాత్రీ వసంతరాత్రి కావాలనిపిస్తుంది, నీకు బతకాలనిపిస్తుంది

***

జాన్ హైడ్ కనుమూరి - పద్యం 
తెల్లవారు జామున బల్లముందుకూర్చొని రాత్రి రాలిన మంచు
బిందువుల్ని ఏరుతుంటాను. పక్షులు విదిల్చే కువకువల్ని వింటూనే
అనంత నముద్రాలపై పయనిస్తుంటాను. ఎవరిదో రాత్రి తడిసిన దిండు,
పించమై పురివిప్పిన అక్షరాల మధ్య రంగులు వెదకుతుంటాను

కూజాలోంచి వంపుకున్న నీళ్ళు గొంతులో చల్లగా జారుతూ
ఎప్పుడో తడిసిన వెన్నెలవానను జ్ఞప్తికి తెస్తుంది. అక్కడో వృద్దుడు
తంత్రులను సరిచెయ్యాలని ఆత్రపడతాడు. తిరిగొచ్చేవారికోసం
కొత్త రాగాన్ని శృతిచేస్తుంటాడు. నింపడానికి నాదగ్గరేసంచీ వుండదు.

నా కోసం తీసుకొచ్చిన పలుకులేమనా వున్నాయా యని
వెదకుతుంటాను. ఎట్నుంచే ఎగిరిపడ్డ నెమలీకొకటి నన్ను
పట్టి వివశుణ్ణి చేస్తుంది. ఒక చిర్నవ్వు మనసుకో, ముఖానికో
పులుముకున్నాననుకొనేలోగా విద్యుత్తు దారితప్పుతుంది.

తెరచుకున్న గుమ్మంముందు ప్యాకెట్టులో ఒదిగిన పాలు
పలకరిస్తాయి. ఇక శబ్దం ఒకొక్కటిగా లోనికి చేరుతుంది.
పరుగులన్నీ తొందరచేస్తాయి. అలుపు, నిద్రలను దులుపి
మళ్ళీ బల్లముందు కూర్చునే వరకు ఏదీ గుర్తుండదు. 
2 కామెంట్‌లు