RSS

వైతరిణికి - శ్రీ కుందుర్తి ముందుమాట

ఒక మంచి ప్రయోగం


ఏ కావ్యానికైనా ఒక కథ అనేది వుంటుంది. ఇది యితివృతానికి సంబంధించిన కథ. కాని యీ కావ్యం వెనకాల మరో కథ వుంది. ముందుగా మనవిచేస్తాను.


శుమారు ఆరేండ్ల క్రితం మిత్రులు శ్రీ సి. నారాయణరెడ్డికి కరీంనగరంలో సన్మానం జరిగిన సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. ఆరోజుల్లో చిరంజీవి కృష్ణారావు ఆ జిల్లాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. మాకుగల స్నేహ బాంధవ్యాలవల్ల నేను సన్మాన సంఘంవారి ఈతిథ్యం స్వీకరించక కృష్ణారావు యింట్లో మకాంవేశాను. అప్పటికి కృష్ణారావు ఏమీ వ్రాయడంలేదు. దాదాపుగా కవితా సన్యాసంచేసి కూర్చున్నాడు. ఆఅరాత్రి చాలా చాలా పొద్దు పొయ్యేవరకు సాగిన సంభాషణలో , ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో కొద్దో గొప్పో అబ్బిన కవితా శక్తిని సాధనద్వారా పదును పెట్టుకోకుండా లౌకిక వ్యవహార నిమగ్నతవల్ల దానిని గాలికి వదలి పెట్టడం ఎంత అన్యాయమో నేను వివరించాను. నాకు మొదల్నుంచి రెండు పిచ్చులున్నాయి. ఒకటి నేను వ్రాసినా వ్రాయకపోయినా కనపడిన ప్రతివాడినీ రాయమనీ ప్రోత్సహించడం, రెండవది ఆధునిక వచన గేయానికి సంప్రదాయవాదులైన కవి పండితుల మెప్పును గూడా వీలైనంత వరకు సాధించడం, ఆనాటి నా వాదన ఆయన గుండెల్లో పశ్చాత్తాప ఆనలజ్వాలలు లేపిందని నాకు తెలియలేదప్పుడు. తరువాత ఒక ఏడాది వ్యవధితో ఒకసారి మా యింటికి వచ్చి "ఇదిగో, నీవుకోరిన కావ్య"మని చేతికందిచ్చాడు. నేనా విషయం ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ అది స్పృహకు వచ్చి పరమానంద భరితుణ్ణయ్యాను. అందువల్ల యీ కావ్యము కృష్ణారావు బిడ్డమత్రమేకాదు, నా బిడ్డకూడా. పైగా నేను స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున ప్రకటించ బడుతున్నందువల్ల దీనితో నా బంధుత్వం మరీ ఎక్కువైంది. రచనలో ఎంత బద్దకం చూపాడో తత్ర్పచురణలో గూడా అంత చేయబట్టి గాని లేకుంటే ఇది ఏనాడో అచ్చు గావలసింది. సకాలంలో అచ్చయి వుంటే కృష్ణారావు యిటువంటి మరికొన్ని కావ్యాలు యీ పాటికి వ్రాసి వుండేవాడని నాకు గట్టినమ్మకం. అయినా యిప్పుడు మించి పోయిందిలేదు.


ఈ కవి యావదాంధ్రావనిని సుమారు ఒక దశాబ్దం పాటు ముంచెత్తిన అభ్యుదయ కవితోద్యమంలో పుట్టి పెరిగినవాడు. అందువల్లనే యా కావ్యంలో యితివృత్తం అధోజగత్సహోదదుల దుర్భర నిత్యజీవిత వర్ణనగా రూపొందింది. మురికి వాడల్లో నివసించే బీదా బిక్కి ప్రజల జీవితంలోని కఠోర సత్యాలను ప్రజల దృష్టికి తీసికొని రావడానికి, తద్వారా వ్యంగ్యంగా సంఘంచేస్తున్న మహాపరాధాన్ని స్ఫురింపచేయడానికి చేసిన యా ప్రయత్నం నూటికినూరు పాళ్ళు అభ్యుదయ ప్రయత్నం. ఈ మురికివాడకు తనే చెప్పినట్లు, యీ "ఒకొక్క నగరం దేహం మీద మానని రాచపుండుల"కు కవిగారు పెట్టిన ముద్దుపేరు "వైతరణి". మానవాభ్యదయానికి ఆటంకంగా యీ మహానది ప్రవహిస్తున్నదని, దారిద్ర్యానికి ఐశ్వర్యానికీ మధ్య దాటరాని సరిహద్దుగా తయారైందని బహుశా కవిగారి వూహ.


వచన కవితోద్యమానికి ప్రత్యేకంగా ఒక తత్వమంటూ ఏమీలేదని ఆనాటి అభ్యుదయ కవిత్వపు తత్వమే మరికొంత విస్తృతమైన రూపంలో యిమిడి వున్నదనీ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ప్రత్యేక తత్వంలేకుండా ఒక ఉద్యమమం ఉంటుందా? అనే సందేహం అలా వుంచుదాం. ఉద్యమం అంటున్నానంటే యిది ఒక ఉధ్యమస్థాయిలో వ్యాపిస్తూవున్నదని చెప్పడమే నా భావం. ఇప్పటికీ అభ్యుదయ కవితా తత్వమే రాజ్యం చేస్తున్నదనడానికి యీ కావ్యం మంచి ఉదాహరణ.ఉఒక దృష్టితో చూస్తే గురజాడ, రాయప్రోలులతో ప్రారంభమైన నవ్య కవిత్వ మంతా అభ్యుదయోద్యమంలో భాగమే. కొత్తనుగురించి అన్వేషించిన ప్రతి ప్రయత్నమూ అభ్యుదయోద్యమ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ జరిగిన ప్రయత్నాల్లో కూడా కొన్ని అనుకొన్నంత కొత్తను సాధించలేకపోవడం , పాతదానినే కొత్తమూసలో పోయడం వంటివికూడా జరుగుతూవుంటాయి. ప్రేమ కవితా ప్రభావితమై సాగిన నవ్య కవితోద్యమ శాఖ యిటువంటిది. ఫలితమేదైనా కొత్తకోసం జరిగిన ప్రయత్నం కాబట్టి, ఉదారంగా అలోచిస్తే అభ్యుదయ తత్వపు విశాలార్థ కిందికి తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమేమిటి, అది ప్రజలను ఎంతగా ఆకర్షించింది, ఆనందపరచింది, వారు దానినెంతగా ఆదరించారు అనే ప్రశ్నలు తర్వాత. ఆరంభంలో సరియైన దారినేరిఎంచుకొని మధ్యలో పొరపాటున అడ్డదారులు తొక్కే ఉద్యమాలు కొన్ని: కళ కళకోసమే అని నమ్మిన ప్రేమ కవులు ఎంత విఫలులైనారో, అభ్యుదయ తత్వం ఒంటబట్టి కూడా ప్రయోగం ప్రయోగం కోసమే అన్న ధోరణిలో రచనలుచేసిన ప్రయోగవాద కవులు కూడా అంతే విఫలులయ్యారు. ప్రజలకూ కవిత్వానికీ గల సంబంధం సరిగా గుర్తించనందువల్లే యీ వైఫల్యం పొందవలసి వస్తుంది. స్థూలంగా చూసినట్టయితే ఏ కాలంలోనైనా రెండే రెండు కవితా తత్వాలు వుంటాయి. ఒకటి ముందుచూపు; రెందవది వెనుక చూపు. ముందుచూపుగ కవిత్వం అభ్యుదయ కవిత్వం. అయితే ప్రతి కవీ కాలప్రభావంచేత కొద్దో గొప్పో ముందుచూపు కలిగే వుంటాడు. జరిగే మార్పుకు అతడు కూడా దోహదం చేస్తూనే వుంటాడు. అందువల్ల కవులందరికి సమిష్టి కృషిగానే సంప్రదాయం కొంచం కొంచంగా మారుతూ వుంటుంది. ప్రజల ఆమోదం పొందుతూ, వారిని తనతో పాటు తీసికపోతూ, మార్పు వస్తుంటుంది. ఈ విధంగా జరిగే మార్పు స్థిరంగా దేశంలో పాతుకుపోతుంది.


అదే సమయంలో కొందరు తీవ్రవాదులు ఒకటినుండి వందవరకు ఒకేసారి గంతేసినట్లు, ప్రజలను తమతో తీసికెళ్ళాలనే ధ్యాస వదలి తామొక్కరే ముందుకు పరుత్తారు. ఈ ప్రజలు మూఢులంటారు; తామొక శతాబ్దం ముందున్నామంటారు; యీ పాడు ఆంధ్రదేశములో పుట్టబట్టి కాని ఏ యింగ్లండులోనో పుట్టినట్లయితే తనకు నోబిల్‌బహుమతి వచ్చివుండేదని నమ్ముతారు. ఇదంతా తన దేశము, తన కాలము, తన ప్రజలను నిర్లక్ష్యముచేసి, నేలవిడిచి చేసే సాముగా తయారవుతుంది. మనకు చూడడానికి కొంత వినోదముగా వుంటుంది తప్ప యిటఉవంటి ఉద్యమాలవల్ల ఫలితమేమి వుండదు. ప్రజలను విస్మరించిన ప్రతి కవితోద్యమము ఏమైనదో సాహిత్య చరిత్ర తెలిసిన వారికి విదితమే.


గురజాడనుండి క్రమ పరిణామం పొందుతూ వస్తున్న కవితా విప్లవంలో యీ నాటికి తేలిన సారాంశమేమంటే, కవితా స్వరూపం అభ్యుదయభావన, స్వరూపంలో వచనా కవితా పద్ధతి. ఈ రెంటినీ సమర్థవంతంగా నిర్వహించడమూ నేటి కవుల కర్తవ్యం, ఈ దృష్టితో చూసినట్లయితే కవిత్వంలో కేవలం రసానుభూతి వాదన నిలవదు. ఆచరణలో అది కవితా పరిధిని సంకుచితంచేసి, కవితా వ్యవసాయాన్ని దాని యందభిమానం గల కొందరు మేధావులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అప్పుడు ప్రభంధ కవులకూ మనకూ వుండే తేడా చాలా స్వల్పం. అందుకే ఆధునిక కవిత వస్త్వాశ్రయ మార్గానికి తిరగాలని నేనంత పట్టుదలగా ప్రతిపాదించడం. సామాజిక అభ్యున్నతి సండేశంగాగల అభ్యుదయ కవిత్వానికి వస్త్వాశ్రయ మార్గమే చక్కగాఉపకరిస్తుంది. దాని విస్త్రుతికి దోహదం చేస్తుంది. ప్రభంధాలలోని వస్త్వాశ్రయత కేవలం నామమాత్రం. వర్ణనాధిక్యతవల్ల అవి దాదాపు మన ప్రేమ కవుల ఆత్మాశ్రయ కవితా భావనలకు దగ్గరి చుట్టాలుగా వున్నాయి. కాగా అనుసరణీయము భారతములోని వస్త్వాశ్రయ మార్గము.


"వైతరణి" కావ్యంలో ఒకే కేంద్ర కథావస్తువునకు సంబంధించిన వివిధ భావపరంపర ఒకదానితో ఒకటి పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో సమకూర్చబడింది. అందువల్ల వస్త్వాశ్రయ కావ్యమార్గానికి చాలా దగ్గిరలో వుంది. ఒకే విషయాన్ని గూర్చిన మనసులో భావజలధి మననంచేసి రసామృత ఖండాన్ని పుట్టించే అలవాటు చాలామంది ఆధునిక కవులకులేదు. పాఠకుని హృదయంలో రసావిష్కరణ చాలా సులభంగా జరుగుతుందనుకుంటున్నారు. లేకుంటే పాఠకులది తప్పనుకుంటున్నారు. కావ్యంలో తాను ప్రతిష్టించే వివిధ ప్రతిభాంశలచేతా, తన అనుభూతిని జగదనుభూతితో మేళవించి ప్రజల హృదయాలను చూరగొనాలనే సంకల్పంచేతా కవి కృతకృత్యుడు కాగలగుతాడు. ఆ విధమైన కావ్యాలను సృష్టించగలిగినప్పుడే ఆధునిక కవితలో వచ్చిన విప్లవం సార్థకమవుతుంది..


వచన కవితా వికాసం జరగడానికి వస్త్వాశ్రయ మార్గం అనుసరణీయమని అంఘీకరిస్తే ఆ మార్గం పూర్తిగా వృద్ధిపొందడానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వం స్థాపించిన "భావలయ" సిద్ధాంతము, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ప్రతిపాదించిన "భావగణ" సిద్ధాంతము బాగా వుపయోగపడే సాధనాలు. వీటినిగురించి యింకా స్పష్టముగా నిర్వచించవలసి వుంది. ఈ "వైతరిణి" కావ్యం "భావలయ" సిద్ధాంతానికి చక్కని లక్ష్యమని నా అభిప్రాయం.


"మండు వేసవిలో

మల్లెపూల అంగడి పెట్టినవారు

పాలబుగ్గల పసి పిల్లడికి

పనస తొన అందించినవారు" అని ప్రారంభమైన ఖండికలో కవితా శిల్ప రహస్యం చక్కగా ఆవిష్కరించబడింది. తన కథానాయకులైన మురికి పేట వాసులు తమ సహజవృత్తులను అవలంభిస్తూనే సంఘానికి ఎంత మహోపకారం చేస్తున్నారో , వారి వునికి సంఘానికి ఎంత అవసరమో వర్ణన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి ప్రయోజన కారులను మురికిపేటల్లో బధించి వుంచడం సంఘం చేస్తున్న దోషమనే వ్యంగ్యం భాషింపచేస్తూ చేసిన యీ వర్ణన మనోహరంగా వుంది. "వెలుతురుస్తంభం" అనే ఖండికలో కవి

"మహామహులు ప్రయాణంచేసే శకటాలకు అనామకులైన సారథు"లైన తన కథా నాయకులు "అన్యాయపు ఆజ్ఞలు శిరసావహించని అనుమానాస్పదులైన సైలికు"అలి కూడా చెప్పి ప్రజల్లోల్ర్ తిరుగుబాటు తత్వాన్ని స్పురింపజేసి ఒక హెచ్చరిక చేసాడు. "చీకటిలో వెలురు స్తంభం నాటించి, సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి అందరికీ వెలుగును పంచి క్రొత్త త్రోవలు త్రొక్కుతారట" తన కథానాయకులు. ఇంతకంటే కవితాత్మకంగానూ, సరళ మనోహరంగానూ ప్రజల స్వభావాన్ని వర్ణించడం కష్టసాద్యం.


చిరంజీవి కృష్ణారావు ఆధునిక తెనుగు సాహిత్యానికి పాత కాపే. ఆయనను గురించి ఎక్కువగా రాయనవసరంలేదు. కాని నాకు అభిమాన ప్రయోగమైన వ్స్త్వాశ్రయ కవితా మార్గంలో యీ ప్రయత్నం జరిగింది కాబట్టి యింతగా రాయవసి వచ్చింది. తీరికలేని ఉద్యోగపు విధులను నిర్వర్తించుకుంటూనే, సాహిత్యానికి కొంత సమయాన్ని సమకూర్చుకో గలిగితే ఆయన యింకా యిటువంటి యింతకంటే మంచి కావ్యాలు రాయగలడని నా విశ్వాసం.


కుందుర్తి

ఫ్రీవర్స్ ఫ్రంట్ , హైదరాబాదు.

25.01.1967


...౬౯౦.....

3 కామెంట్‌లు:

Kalpana Rentala చెప్పారు...

akshara dosham. kandurti kaadu. kumdurti kadaa.saricheyagalaru.

నెలనెలావెన్నెల చెప్పారు...

@కల్పన రెంటాల
సరిచేయబడింది
స్పందనకు
నెనరులు

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

అద్భుతమైన ముందుమాట
చర్చించిన అనేక అంశాలను మళ్ళీ చదవగలిగాను