వైతరణి నుంచి రస్తూ రాస్తూ
ఎక్కడో ఎప్పుడో ఏక్షణాన్నో కొందరి మనసులు గాయపడతాయి. బహుశా అందరిమనసులు గాయపడతాయి, కానీ చాలా మంది గాయాలు మానవు. కొంతమంది గాయాలు మానవు. కొంతమంది మానని తన గాయాలతో ఇతరులకు గాయాలు చేస్తారు. ఈ క్రమంలో కవులయిన వాళ్ళని సౌందర్యం, దరిద్రం, ఉద్యమాలు, విప్లవాలు వగైరాలు ఆకర్షిస్తాయి. వాటితొ తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సమన్వయం కుదిరిన వాళ్ళు స్రవంతిలో కలుస్తారు. కాలేని వాళ్ళు ఒంటరిద్వీపాలుగా మిగిలిపోతారు.
"వైతరిణి నుంచి రాస్తూ రాస్తూ" అన్న ఈ గ్రంధంలో సి.వి.కృష్ణారావుగారి వైతరణి, మాదీ మీవూరే, అవిశ్రాంతం, కిల్లారి, రాస్తూ రాస్తూ అన్న ఐదు కవితాసంపుటాలు ఉన్నాయిలు. వైతరణి, మాదీ మీ ఊరే అన్న సంపుటాలు అభ్యుదయ భావజాలంతో నిండినవి..
‘మాదీ మీ ఊరే'కి కృష్ణారావుగారు రాసుకున్న ముందుమాట చదివితే ఆయన నిస్సహాయ ఆక్రోశం మనకు కనిపిస్తుంది.
అశ్వారూఢుడు క్రిందపడగానే అనామకుడు అంకెంలో కాలుపెట్టి కళ్ళెం చేత్తో పట్టుకొని గేలప్ చేస్తున్నాడు. నావ దొరక్కపోతే కళ్ళెం పొత్తికడుపుకు కట్టుకొని ఒడ్దున ఉన్న వాళ్ళందర్నీ వెక్కిరిస్తూ దుఖఃవారథి దాటఛానికి వీపు దొరకక తన పెదిమను మునివేళ్ళతో మీటుతున్నాడు.
అనామకుణ్ణీ, దిగంబరినీ, క్షుదార్తుణ్ణీ అయిన నేను నా అనుంగు సోదరులకు రత్నకిరీటాలు చేయాలనీ, విరిగిపోయిన వాళ్ళ వేళ్ళకు అంగుళీకాలు చేయాలనీ వారి గాధల ప్రథమాంకం నా రచన అనీ చెప్పుకున్నారు.
కోలుకోలేనితనాన్ని ప్రేమించేవాళ్ళు స్వకీయ విలక్షణ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వాళ్ళు కవులయితే, సుకుమారులయితే వాళ్ళ భాధ కూడా విచిత్రాన్ని పులుముకుంటుంది. నిరాశకు మారు పేరయిన నిహిలిజం వాళ్ళు పిలవకున్నా వాళ్ళని వెంబడిస్తుంది. అన్నింటి పట్లా ఆయన నమ్మకం ఒక ఆకర్షణని అదనంగాఅ అందిస్తుంది. అది అన్నీ కోల్పోయిన వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. తమాషా ఏమిటంటే ప్రపంచయుద్ధ బీభత్సాలకు మనసు పాశ్చాత్యకవుల ప్రతిభా శకలాలతో పోల్చదగిన అధునాతన అభివ్యక్తిని నలబై ఏళ్ళ క్రితమే సాధించిన కృష్ణారావు గారు అధోజగత్ సహోదరుల్తో ఆత్మీకంగా ఏకంకావలని ప్రయత్నించడమే. ఒకే కవితలో అధివాస్తవిక అభివ్యక్తి దానికి లొంగని జీవన వాస్తవికత ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది.
"అనుక్షణం అతి సున్నితమైన దారానికి
వ్రేలాడుతుంటుంది ప్రాణం
అద్దంలో ముఖం చూసుకుంటే
అప్పుడప్పుడూ వక్రించి ఉంటుంది
ఫలానా రోజున సూర్యుడు పొడమడనీ
నక్షత్రాలు పొగడపూలలా రాలిపోతవనీ
అల్లకల్లోలం ఆక్రమించుకుంటుందనీ
ఒక వుద్రేకం అప్పుడప్పుడు
ఆవిష్కరింపబడుతుంది.
అద్దెయింటి కిరాయి దగ్గర
దుకాణం సరుకల దగ్గర
అలవాట్ల అంగిట్లోపట్టే పడిశం దగ్గర
పరువునిద్రించే తెరమరుగున
వుమ్మిలో బడ్డ యీగలాగా
మనస్సుకు సంకెళ్ళుపడుతై (88పేజి)
కృష్ణారావు గారి అభివ్యక్తిలో ఆధునిక, ఆధునికానంతర ధోరణులు ఉన్నాయి. కానీ ఎక్కడా జీవితం పట్ల ఆఆశ, నమ్మకం లేవు.
'ఆలయాల్ని శిథిలాలు చేసి వాటిలో విగ్రహాలు వెతకడం'వంటి విధ్వంస ఆకర్షణలు అవిశ్రాంతం సంపుటిలో కనిపిస్తాయి. తన అస్తిత్వాన్ని విస్మరించి జనంలో కలవాలన్న తపనా ఈ సంపుటిలో కనిపిస్తుంది. తన ఒంటరి స్తంభంలోని ఆలోచనల్ని ఆయన గుర్తించినట్టు కూడా తెలుస్తుంది.
'నా' అనే కవితలో 'నీ'ను విస్మరించి నలుగురిలో నలుసుగా మెలుగు
ఒక్క గజం కొలుస్తూ ఏకాకివి కాకు
అందరితో ఒకేసారి రోదించు
ఒకేస్వరంతో స్పందించు
భుజం భుజం కలిపి సంఘర్షించు' అంటారు.
ప్రపంచంలో విషాదమేకాదు, ఆనందం కూడా ఉంది. కానీ కృష్ణారావుగారి లాంటి సున్నిత సుకుమార భావుకులు కొమ్మనించి రాలుతున్న పువ్వులోనూ మానవ జాతి సామూహిక మరణ్ దృశ్యాన్ని చూస్తారు. భయం అన్నది వారి బాధలో కలిసిపోయింది. కన్నీళ్ళు కార్చిన నేత్రాలు ఆనందబాష్పాలు కూడా రాలుస్తాయన్న సత్యాన్ని కృష్ణారావుగారు అంగీకరించరు. పాక్షిక ప్రదర్శన చేసే పరివేదనా పార్శ్వాన్నే ఇష్టపడతారు.
కృష్ణారావుగారు ఆధునికులేకాదు, అత్యాధునికులు కూడా. కృష్ణారావుగారి కవిత్వం బండబారిన, చలనంలేని చైతన్యంలోని మనసుక్ని ఛేదిస్తుంది. జీవితమంతా హాయిగా వుందాలనుకునే వాళ్ళు, ఒక సాంప్రదాయాన్ని భుజాన వేసుకున్నవాళ్ళు, పీఠాధిపతుల బీటలు వారేలా చేసే అధునాతన అణు విస్పోటనలు కృష్ణారావుగారి కవితలు. కానీ నమ్మకం లేకపోవడం అన్నికన్నా విషాదం. నమ్మకం లేకపోసే విషాదం నిషాగా మరుతుంది .. గిల్బర్ట్ అన్నట్లు...
Heavy the sorrow that bows the head where love is alive and hope is dead.
సౌభాగ్య
ఆంధ్రప్రభ 10.1.1999 నుంచి
(ప్రచురణ : 1997, రచన: సి.వి కృష్ణారావు, పేజీలు :268, వెల 50/-రూపాయలు ,
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ, విశాలాంద్ర, హైదరాబాద్ 500 001.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి