దళిత నిబద్ధ దార్శనికత - డా. సుమనశ్రీ
లేబుళ్లు: వ్యాసాలు, సాహిత్యం, సి.వి కృష్ణారావుసి.వి.కృష్ణారావుగారు అప్పుడూ ఇప్పుడూ దళితకవే. ఆనాడూ ఈ నాడూ కమ్యూనిష్టే. విద్యార్థి దశలో మార్కిష్టు బీజాలు పట్టుకుని, జైల్లో వున్న వారం పదిరోజుల్లోనే అధికారం పడగనీడని పసిగట్టి జరుగుతున్న దోపిడినీ, దుర్మార్గాన్నీ అర్థంచేసుకున్నారు. కాబట్టి ఒక్క కవిత్వంలోనేకాదు, జీవితంలోనూ మార్కిష్టుగానే ఊపిరి పీలుస్తున్నారు. దళిత ప్రజాకవిగానే కవిత్వం వ్రాస్తున్నారు.
సి.వి.కృష్ణారావుగార్ని తల్చుకున్నప్పుడల్లా “I am large … I contain multitudes” అంటూ ఆశ్చర్యపరిచే అమెరికన్ మహాకవి వాల్ట్ విట్మన్ బానిసత్వంపై 18855లోనే తన కావ్యం “లీవ్స్ ఆఫ్ గ్రాస్”లో తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. నీగ్రోలపై తెల్లజాతి దౌర్జన్యాన్ని నిరసించాడు. “సాంగ్ ఆఫ్ మైసెల్స్ “అనే సుదీర్ఘ కవితలో” గాయపడ్డవాణ్ణి ఎలావున్నావని ప్రశ్నించను, నేను గాయపడ్డ వాణ్ణవుతాను అంటున్నాడు విట్మన్. కృష్ణారావుగారు అంతే విట్మన్ హృదయంలో ఎంతమందికి చోటుందో కృష్ణారావుగారి హృదయంలోనూ అంతమందికి చోటుంది. భూమ్మీద నడుస్తున్న మానవత్వంలా కనిపిస్తారాయన. ఖచ్చితమైన సామాజిక అవగాహన వుండి, విప్లవాత్మకమైన హృదయంతో ద్వేష, అసూయల్ని ఆమడదూరంలోనే ఉంచారాయన. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కవిత్వం ఎక్కడున్నా, ఎలాగున్నా భుజం తట్టడం తన బాధ్యతగా “నెలనెలా వెన్నెల” నిర్వహిస్తున్నారాయాయన. ఎంతమందితో ఎలా తిరుగుతున్నా హృదయంనిండా దళితుల గురించిన వైతరణి వొడ్డున నివసితున్న దళితుల గురించిన ఆలోచనే. మురికిపేటల్లో ఊపిరిపీలుస్తున్న అభాగ్యుల గురించే ఆవేదన.
1968లో ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుఫున కుందుర్తి పీఠికతో వెలువడ్డ వైతరణి కావ్యం కృష్ణారావుగార్ని అభ్యుదయదళిత కవిగా లోకం ముందుకు తెచ్చింది. వృత్తిరీత్యానే కాదు, ప్రవృత్తిరీత్యా కూడా కృష్ణారావు గారి హృదయం ఎప్పుడూ దళితుల జీవితాన్నే తన కళ్ళముందుంచుకుంది. దళితులలో ఎక్కువ మంది తరతరాలుగా దరిద్రంలో బతుకీడుస్తున్నవాళ్ళే. గుడిసెలలో నివసిస్తూ మురికి నీటి దుర్గంధం ?ఊపిరి పీలుస్తున్నవాళ్ళే. కుళ్ళుకాలవనే నరకలోకపు వైతరిణిగా కృష్ణారావుగారు గుర్తించారు. మురికిపేటలో మసలే మూగజీవాల బాధల్ని ఎంత దగ్గరగానో పరిశీలిస్తే తప్ప “వైతరణి” లాంటి కావ్యం రూపు దిద్దుకోదు. ఈ కావ్యంలో ఉన్న పదహారు కవితలలోనూ వస్తువు నరక సదృశ్యమైన దళిత జీవితమే. కవితలన్నీ ఒకే వస్తువు చుట్టూ నిర్మింపబటంతో పాఠకులపై బలమైన ముద్ర వేస్తుంది ఈ కావ్యం.
యమలోకం త్రోవలో వైతరణి
మురికిపేట మలుపులో
ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ
అన్న వాక్యాలతో వైతరణి అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. ఆ వైతరణి ఒడ్డున ఉన్నవాళ్ళు ఎవరంటే
“వైతరణి ఒడ్డున బాధకు చిహ్నాలై
సుప్రసిద్ద గాధలకు గాయకులై
ఒకడు గుఃహుడు
ఒకడు చెప్పులు కుట్టేవాడు
ఒకడు అంధుడు ఒకడు బంధువు”అని సమాధానం చెబుతారు. “మహాగుహులు” అన్న కవితలో రకరకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న వాళ్ళని వర్ణిస్తారు.
“మానవులు మాలిన్యం చేసే చోట్లను
ఓర్పు చీపుర్లతో తుడిచినవారు”
“ముళ్ళను గులకరాళ్ళను
నెత్తురు కళ్ళయిచూసే
పాదాలకు చెప్పులు కుట్టినవారు”
“నాగజెముడు బొంతలా
నలుగురు ఏవగించుకున్న ముదుసలికి
తలకొరువులు పెట్టేవారు”
ఈ వృత్తులన్నీ బానిసవృత్తులే. ఈ వృత్తులలో అవమానం ఎక్కువ. కష్టం ఎక్కువే కానీ సంపాదన మాత్రం బహుస్వల్పం. అందుకే ఇంటినిండా దుర్భరమైన దారిద్ర్యం.
“దేహానికి కాపుంచను
ఒక పేలిక అసలుండదు”
“జుట్టుకు పట్టించుకోను
నూనెబొట్టు నిలవుండదు”
“రెక్కలు డొక్కలోకి నెట్టి
ఒక్కొక్కరకం అలమటిస్తుంటే
రేపన్నది ఘోషించదు”
1969లోనే కృష్ణారావుగారు “కళ్ళు తెరిచిచూడు” అన్న కవితలో
బలిపీఠంమీద మెడపెట్టిన బాలకుడా
పులిపంజా ముందున్న మానవుడా
నీ బవిష్యత్తు చీకట్లో దాగున్నది
కళ్ళుతెరిచి చూడు కనిపిస్తున్నది”
అంటూ దళితుల్ని హెచ్చరించే వున్నారు. దళితులు ఒక సంఘటన శక్తిగా రూపొందవలసిన అవసరాన్ని ఆనాడే నొక్కి పలికారు.
1969లో సృజన ప్రచురణగా వెలువడిన “మాదీ మీ ఊరే” సంకలనం కూడా కృష్ణారావుగారిని
దళితుల పక్షాన్నే నిలిపింది.
“మాదీ మీ వూరే మహరాజ కుమారా
గోచీకి పేలిక లేక గుడిసెల గుంపుల్లో
పెరిగిన బాలురలో ఒకణ్ణి
చిన్నబాబు పోతుంటే
త్రోవలో నీవెందుకని
తరిమికొట్టబడి తూలనాడబడిన తెరువరిని”
అని ఊరు చూడవచ్చిన వొకప్పటి రాజుగార్ని ఎగతాళి చేస్తున్నాడు దళితుడుఈ సంకలనంలోని చివరి ప్రస్తావన “రేపు”లో ఏమంటున్నారో చూడండి.
“వేలుపెట్టి చూపించి
తుపాకి కాల్చడానికి బుల్స్‌ఐ యింకా అమర్చబడలేదు
అమర్చబడినా తుపాకులు రెడీగాలేవు
తుపాకులుంటే వ్రేళ్ళకు వాడకం తెలీదు
అందుకనే ఇది మహచ్చాతి కాలం
ఈ మహచ్చాతి కాలంలో
ఒక ప్రథమాంకం ప్రద్ర్శనమౌతున్నది
అశ్వారూఢుడు కిందపడగానే
అనామకుడు అంకెంలో కాలుపెట్టి
కళ్ళెం చేత్తోపట్టుకుని గేలప్ చేస్తున్నాడు”
పై వాక్యాలలో ముందుచూపు తెలుస్తూనే ఉంది.
మార్క్సిజం, అంబేద్కరిజంల వెలుగులో తమ రాజ్యాన్ని తాము దక్కించుకోవడానికి ద్ళితులు సాయుధులవటం మనం చూస్తూనే ఉన్నాం. 1991లో వెలువరించిన “అవిశ్రాంతం” కవితా సంపుటిలోలి “అగ్రగామి అంబేద్కర్” అన్న కవితలో కూడా ఈ విషయాన్నే స్పష్టపరుస్తున్నారు కృష్ణారావుగారు. రాబోయే యుగం దళితులదేనని నమ్మబలుకుతున్నారు.
అగ్రహావేశ అభ్యుదయ పోరాట కవిత్వంలో సూటిదనం ముఖ్యం. కృష్ణారావుగారి కవిత్వం చదువుతున్నంతసేపూ సింబల్సు గురించికానీ, పదచిత్రాల గురించికానీ, శిల్పం గురించి కానీ మనకి ఆలోచన రాదు. వస్తువుతోనే హృదయాల్ని కదిలించే ఇలంటి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించిన భావమే శిల్పం. మనసుని సూటిగా తాకే భాషే పదచిత్రం. దళితుల జీవనవేదనే ఈ కవిత్వానికి ప్రతీక!
ఉదయం 28.11.1994 నుంచి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి