RSS

ఒక లక్ష బొటమన వేళ్ళు చదివినవాడు


కవి దేవతలను ఆవాహన చెయ్యగలడు, కాని విపత్తుయెదుట మూగబోతాడు. వీరుడొక్కడే విపత్తుని ఎదుర్కోగలవాడు. దానితో ముఖాముఖీ, బాహా బాహీ తలపడగలవాడు. కనుకనే భౌతిక విపత్తులు, ఆకలి, కరువు, యుద్ధం, ఉప్పెన, తుఫాను, అశనిపాతం సంభవించిన ఏ సందర్భంలోనయినా ముందు వీరులు పుడతారు. ఆ తరువాతే ఆ వీరుల్నిదేవతలుగా స్తుతిస్తూ కవులు పుట్టేది.
ఇందుకేమైనా మినహాయింపు ఉందా అంటే ఉందనాలి. వీరుల్లాంటి కవులూ, కవుల్లాంటి యోధులూ ఎక్కడయినా ప్రభవిస్తారా అంటే ప్రభవిస్తారనే అనాలి. ఎక్కడిదాకానో ఎందుకు మన గరిమెళ్ళ సత్యనారాయణ, సుద్దాల హనుమంతు, సుబ్బారావు పాణిగ్రాహి, చెరబండరాజు, శివసాగర్‌, గద్దర్‌, ఇప్పుడు దామూ - మనది ధన్యభూమి కనుక ఈ కోవకి అంతంలేదు.
ప్రజాకవులొక్కరే విపత్తు జుట్టు పట్టుకొని దాని మెడలు ఒంగదీసి "కురువృద్దుల్‌, కురుబాంధవుల్‌ చూచుచుండగ" ఎలుగెత్తి తమ శాపాల్నీ, శపథాల్నీ కుమ్మరించగలరు. ప్రజాకవిత వీరకవితా సంప్రదాయం - దాన్ని పాటకో, పదానికో పరిమితంచెయ్యలేం. ఈ చిన్ని సంపుటంలోని వచనాల్ని చదివిన వారికి ఈ విషయమే బోధపడుతుంది. అజ్ఞాతుడయిన ఏ రాయలసీమ ప్రజాకవి వీరుడో ఎన్నడో 'ధాతకరువు'పైని పాడిన విషాదభరిత గీతాన్నొకసారి ఆమళ్ళదిన్నె గోపీనాథ్‌ గారు వినిపించగా విన్నాను. ఆనాడు నే పొందిన బాధామయస్పురణని తిరిగి ఈ కవితల్లో కన్నాను.
చాలా యేళ్ళ కిందట తన గురించి కృష్ణారావు గారు ఇలా రాసుకున్నారు.
"వాళ్ళు .... గుడిశముందు మురికి గుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే సగంచెప్పి సగంచెప్పక పూర్తిగా బాధ చెప్పటానికి మాటలురాక అర్జీ రాసికోవటానికి యిళ్ళల్లో కాగితంలేక చేతుల్లో కలాలు లేక ఏకలవ్యుల్లా నాకు వారి బొటిమన వేళ్ళీచ్చారు. ఒక లక్ష బొటిమన వేళ్ళూ నేను వ్రాసాను - చదివాను. ముదుసళ్ళవీ, వయస్కులవీ, స్త్రీలవీ, పురుషలవీ, ఆరోగ్యవంతులవీ, పాపలవీ, వీరులవీ .... (వైతరణి - 1968)"
శిష్ట సంప్రదాయానికి చెందిన కవి పూర్వకవి సమయాలను బాగా అధ్యయనం చేస్తాడు. కానీ ప్రజాసంప్రదాయానికి చెందిన కవి లక్ష బొటిమన వేళ్ళను చదువుతుంటాడు, పోల్చుకుంటాడు. కృష్ణారావుగారు వచన మార్గానికి చెందిన ప్రజాకవి. ఎన్నో రోజులుగా ఈ కవితల్తో నేను కలిసి గడిపిన మీదట ఇప్పుడు చెప్పగలిగింది ఇదే. బాదా సందర్బాన్ని మనం మర్చిపోవాలనుకుంటాం. కానీ కవి గుర్తుచేస్తాడు. మనవంటి మందమతులకి తిరిగి తిరిగి గుర్తుచేసే ఈ బాధ్యతని నెత్తికెత్తుకున్నందుకు కవిది నిత్య బాధా సందర్బం. మన బాధా, తన బాధా అందరి బాధా తనే పడుతున్న తల్లిలాంటి, భూమిలాంటి కవి మన ముందుకు వచ్చినపుడు ఇకనైనా జాగు చెయ్యక వెంటనే పోల్చుకుందాం.
వాడ్రేవు చినవీరభద్రుడు.
హైదరాబాదు, 18.7.1996
-----
1993 సెప్టెంబరు 30వతేదీ రాత్రి లాతూర్‌, ఉస్మానాబాద్‌(మహారాష్ట్ర) జిల్లాల 69 గ్రమాల్లో భయంకరంగా భూమి కంపించిన సందర్భంలో కవిగా స్పందించి, ప్రదేశాలను దర్శించి, అక్షరీకరించి "కిల్లారి" పేరిట 1996లో మనముందుకొచ్చింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

its translated "Fiery and fierce"
by Dr. VVB Rama Rao