RSS

నెలనెలా వెన్నెల సమవేశము 25.౪.౨౦౧౦ ఫోటోలు

25.4.2010 సాయంత్రం నెలనెలా వెన్నెల సమావేశము బాగా జరిగింది. మోహన్ రెడ్డి గారు వీడియో తీసారు.
యాకూబ్ గారు ఇది శ్రీశ్రీ స్మారక సభ అన్నారు.ఆయన శ్రీశ్రీ రాసిన పతితులార భ్రస్టులార పాట పాడారు.
జగన్ పాడవోయి భారతీయుడా అని పాడారు.
శిలాలొలిత ,రేణుక అయోల,,వీరయ్య, ధర్మా చారి,పార్వతిమూహన్ , యం.స్.నాయుడు,
క్రిష్ణారావు గార్లు కవితా గానం చేసారు. శ్యామల, ప్రసాద్ గారు, శ్రీనివాస రావు, రాములు పాల్గొన్నారు.


















పార్వతి మొహన్ 4 కామెంట్‌లు

దళిత నిబద్ధ దార్శనికత - డా. సుమనశ్రీ





సి.వి.కృష్ణారావుగారు అప్పుడూ ఇప్పుడూ దళితకవే. ఆనాడూ ఈ నాడూ కమ్యూనిష్టే. విద్యార్థి దశలో మార్కిష్టు బీజాలు పట్టుకుని, జైల్లో వున్న వారం పదిరోజుల్లోనే అధికారం పడగనీడని పసిగట్టి జరుగుతున్న దోపిడినీ, దుర్మార్గాన్నీ అర్థంచేసుకున్నారు. కాబట్టి ఒక్క కవిత్వంలోనేకాదు, జీవితంలోనూ మార్కిష్టుగానే ఊపిరి పీలుస్తున్నారు. దళిత ప్రజాకవిగానే కవిత్వం వ్రాస్తున్నారు.

సి.వి.కృష్ణారావుగార్ని తల్చుకున్నప్పుడల్లా “I am large … I contain multitudes” అంటూ ఆశ్చర్యపరిచే అమెరికన్‌ మహాకవి వాల్ట్‌ విట్మన్‌ బానిసత్వంపై 18855లోనే తన కావ్యం “లీవ్స్‌ ఆఫ్‌ గ్రాస్‌”లో తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. నీగ్రోలపై తెల్లజాతి దౌర్జన్యాన్ని నిరసించాడు. “సాంగ్‌ ఆఫ్‌ మైసెల్స్‌ “అనే సుదీర్ఘ కవితలో” గాయపడ్డవాణ్ణి ఎలావున్నావని ప్రశ్నించను, నేను గాయపడ్డ వాణ్ణవుతాను అంటున్నాడు విట్మన్‌. కృష్ణారావుగారు అంతే విట్మన్‌ హృదయంలో ఎంతమందికి చోటుందో కృష్ణారావుగారి హృదయంలోనూ అంతమందికి చోటుంది. భూమ్మీద నడుస్తున్న మానవత్వంలా కనిపిస్తారాయన. ఖచ్చితమైన సామాజిక అవగాహన వుండి, విప్లవాత్మకమైన హృదయంతో ద్వేష, అసూయల్ని ఆమడదూరంలోనే ఉంచారాయన. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కవిత్వం ఎక్కడున్నా, ఎలాగున్నా భుజం తట్టడం తన బాధ్యతగా “నెలనెలా వెన్నెల” నిర్వహిస్తున్నారాయాయన. ఎంతమందితో ఎలా తిరుగుతున్నా హృదయంనిండా దళితుల గురించిన వైతరణి వొడ్డున నివసితున్న దళితుల గురించిన ఆలోచనే. మురికిపేటల్లో ఊపిరిపీలుస్తున్న అభాగ్యుల గురించే ఆవేదన.

1968లో ఫ్రీవర్స్‌ ఫ్రంట్ తరుఫున కుందుర్తి పీఠికతో వెలువడ్డ వైతరణి కావ్యం కృష్ణారావుగార్ని అభ్యుదయదళిత కవిగా లోకం ముందుకు తెచ్చింది. వృత్తిరీత్యానే కాదు, ప్రవృత్తిరీత్యా కూడా కృష్ణారావు గారి హృదయం ఎప్పుడూ దళితుల జీవితాన్నే తన కళ్ళముందుంచుకుంది. దళితులలో ఎక్కువ మంది తరతరాలుగా దరిద్రంలో బతుకీడుస్తున్నవాళ్ళే. గుడిసెలలో నివసిస్తూ మురికి నీటి దుర్గంధం ?ఊపిరి పీలుస్తున్నవాళ్ళే. కుళ్ళుకాలవనే నరకలోకపు వైతరిణిగా కృష్ణారావుగారు గుర్తించారు. మురికిపేటలో మసలే మూగజీవాల బాధల్ని ఎంత దగ్గరగానో పరిశీలిస్తే తప్ప “వైతరణి” లాంటి కావ్యం రూపు దిద్దుకోదు. ఈ కావ్యంలో ఉన్న పదహారు కవితలలోనూ వస్తువు నరక సదృశ్యమైన దళిత జీవితమే. కవితలన్నీ ఒకే వస్తువు చుట్టూ నిర్మింపబటంతో పాఠకులపై బలమైన ముద్ర వేస్తుంది ఈ కావ్యం.

యమలోకం త్రోవలో వైతరణి

మురికిపేట మలుపులో

ఒదిగి ఒదిగి ప్రవహించే కాలువ

అన్న వాక్యాలతో వైతరణి అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. ఆ వైతరణి ఒడ్డున ఉన్నవాళ్ళు ఎవరంటే

“వైతరణి ఒడ్డున బాధకు చిహ్నాలై

సుప్రసిద్ద గాధలకు గాయకులై

ఒకడు గుఃహుడు

ఒకడు చెప్పులు కుట్టేవాడు

ఒకడు అంధుడు ఒకడు బంధువు”అని సమాధానం చెబుతారు. “మహాగుహులు” అన్న కవితలో రకరకాల వృత్తులతో జీవనం సాగిస్తున్న వాళ్ళని వర్ణిస్తారు.

“మానవులు మాలిన్యం చేసే చోట్లను

ఓర్పు చీపుర్లతో తుడిచినవారు”

“ముళ్ళను గులకరాళ్ళను

నెత్తురు కళ్ళయిచూసే

పాదాలకు చెప్పులు కుట్టినవారు”

“నాగజెముడు బొంతలా

నలుగురు ఏవగించుకున్న ముదుసలికి

తలకొరువులు పెట్టేవారు”

ఈ వృత్తులన్నీ బానిసవృత్తులే. ఈ వృత్తులలో అవమానం ఎక్కువ. కష్టం ఎక్కువే కానీ సంపాదన మాత్రం బహుస్వల్పం. అందుకే ఇంటినిండా దుర్భరమైన దారిద్ర్యం.

“దేహానికి కాపుంచను

ఒక పేలిక అసలుండదు”

“జుట్టుకు పట్టించుకోను

నూనెబొట్టు నిలవుండదు”

“రెక్కలు డొక్కలోకి నెట్టి

ఒక్కొక్కరకం అలమటిస్తుంటే

రేపన్నది ఘోషించదు”

1969లోనే కృష్ణారావుగారు “కళ్ళు తెరిచిచూడు” అన్న కవితలో

బలిపీఠంమీద మెడపెట్టిన బాలకుడా

పులిపంజా ముందున్న మానవుడా

నీ బవిష్యత్తు చీకట్లో దాగున్నది

కళ్ళుతెరిచి చూడు కనిపిస్తున్నది”

అంటూ దళితుల్ని హెచ్చరించే వున్నారు. దళితులు ఒక సంఘటన శక్తిగా రూపొందవలసిన అవసరాన్ని ఆనాడే నొక్కి పలికారు.

1969లో సృజన ప్రచురణగా వెలువడిన “మాదీ మీ ఊరే” సంకలనం కూడా కృష్ణారావుగారిని

దళితుల పక్షాన్నే నిలిపింది.

“మాదీ మీ వూరే మహరాజ కుమారా

గోచీకి పేలిక లేక గుడిసెల గుంపుల్లో

పెరిగిన బాలురలో ఒకణ్ణి

చిన్నబాబు పోతుంటే

త్రోవలో నీవెందుకని

తరిమికొట్టబడి తూలనాడబడిన తెరువరిని”

అని ఊరు చూడవచ్చిన వొకప్పటి రాజుగార్ని ఎగతాళి చేస్తున్నాడు దళితుడుఈ సంకలనంలోని చివరి ప్రస్తావన “రేపు”లో ఏమంటున్నారో చూడండి.

“వేలుపెట్టి చూపించి

తుపాకి కాల్చడానికి బుల్స్‌ఐ యింకా అమర్చబడలేదు

అమర్చబడినా తుపాకులు రెడీగాలేవు

తుపాకులుంటే వ్రేళ్ళకు వాడకం తెలీదు

అందుకనే ఇది మహచ్చాతి కాలం

ఈ మహచ్చాతి కాలంలో

ఒక ప్రథమాంకం ప్రద్ర్శనమౌతున్నది

అశ్వారూఢుడు కిందపడగానే

అనామకుడు అంకెంలో కాలుపెట్టి

కళ్ళెం చేత్తోపట్టుకుని గేలప్‌ చేస్తున్నాడు”

పై వాక్యాలలో ముందుచూపు తెలుస్తూనే ఉంది.

మార్క్సిజం, అంబేద్కరిజంల వెలుగులో తమ రాజ్యాన్ని తాము దక్కించుకోవడానికి ద్ళితులు సాయుధులవటం మనం చూస్తూనే ఉన్నాం. 1991లో వెలువరించిన “అవిశ్రాంతం” కవితా సంపుటిలోలి “అగ్రగామి అంబేద్కర్‌” అన్న కవితలో కూడా ఈ విషయాన్నే స్పష్టపరుస్తున్నారు కృష్ణారావుగారు. రాబోయే యుగం దళితులదేనని నమ్మబలుకుతున్నారు.

అగ్రహావేశ అభ్యుదయ పోరాట కవిత్వంలో సూటిదనం ముఖ్యం. కృష్ణారావుగారి కవిత్వం చదువుతున్నంతసేపూ సింబల్సు గురించికానీ, పదచిత్రాల గురించికానీ, శిల్పం గురించి కానీ మనకి ఆలోచన రాదు. వస్తువుతోనే హృదయాల్ని కదిలించే ఇలంటి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించిన భావమే శిల్పం. మనసుని సూటిగా తాకే భాషే పదచిత్రం. దళితుల జీవనవేదనే ఈ కవిత్వానికి ప్రతీక!

ఉదయం 28.11.1994 నుంచి 0 కామెంట్‌లు

అగ్రగామి అంబేద్కర్‌




పుడమితల్లికి పురుడుపోసి
గోమాత పొదుగు కడిగి
ఇంటికప్పుకు రెల్లుకప్పి
డొక్కకు రెక్కలు కలిపిన
స్పర్శకు అస్పృశ్యత ఫలసాయం
విస్తరి నుండి ఊడిన ఆకులా ?
నావ్ కుదురు నుంచి విరిగిన బద్దలా ?
పాలపుంత నుంచి రాలిన చుక్కలా ?


"ఏడవకు
బైటికిరా,
రాజ్యాలేలంటే
కళ్ళప్పగించి ఏం లాభం ?
పద ఐదో తమ్ముడిగా కాదు
అగ్రగామిగా"
అదుగో
ఎవరో వెల్తురు మోసుకుంటూ వస్తున్నారు
వెలుగు తన కక్కర్లేదా ఏం?
జన సమూహానికి దారి చూపుతున్నాడు
ఆయనే అగ్రగామిగా ఉండి
అవస్థల వ్యవస్థలు దాటుతూ...
ఇంకా సిద్దించని కోర్కల బి.ఆర్‌. అంబేద్కర్‌



సివి. కృష్ణారావు ..... అవిశ్రాంతం నుంచి 3 కామెంట్‌లు

కన్నీటి కుండల్ని మోస్తున్న కవి

వైతరణి నుంచి రస్తూ రాస్తూ


ఎక్కడో ఎప్పుడో ఏక్షణాన్నో కొందరి మనసులు గాయపడతాయి. బహుశా అందరిమనసులు గాయపడతాయి, కానీ చాలా మంది గాయాలు మానవు. కొంతమంది గాయాలు మానవు. కొంతమంది మానని తన గాయాలతో ఇతరులకు గాయాలు చేస్తారు. ఈ క్రమంలో కవులయిన వాళ్ళని సౌందర్యం, దరిద్రం, ఉద్యమాలు, విప్లవాలు వగైరాలు ఆకర్షిస్తాయి. వాటితొ తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సమన్వయం కుదిరిన వాళ్ళు స్రవంతిలో కలుస్తారు. కాలేని వాళ్ళు ఒంటరిద్వీపాలుగా మిగిలిపోతారు.


"వైతరిణి నుంచి రాస్తూ రాస్తూ" అన్న ఈ గ్రంధంలో సి.వి.కృష్ణారావుగారి వైతరణి, మాదీ మీవూరే, అవిశ్రాంతం, కిల్లారి, రాస్తూ రాస్తూ అన్న ఐదు కవితాసంపుటాలు ఉన్నాయిలు. వైతరణి, మాదీ మీ ఊరే అన్న సంపుటాలు అభ్యుదయ భావజాలంతో నిండినవి..


మాదీ మీ ఊరే'కి కృష్ణారావుగారు రాసుకున్న ముందుమాట చదివితే ఆయన నిస్సహాయ ఆక్రోశం మనకు కనిపిస్తుంది.


అశ్వారూఢుడు క్రిందపడగానే అనామకుడు అంకెంలో కాలుపెట్టి కళ్ళెం చేత్తో పట్టుకొని గేలప్‌ చేస్తున్నాడు. నావ దొరక్కపోతే కళ్ళెం పొత్తికడుపుకు కట్టుకొని ఒడ్దున ఉన్న వాళ్ళందర్నీ వెక్కిరిస్తూ దుఖఃవారథి దాటఛానికి వీపు దొరకక తన పెదిమను మునివేళ్ళతో మీటుతున్నాడు.


అనామకుణ్ణీ, దిగంబరినీ, క్షుదార్తుణ్ణీ అయిన నేను నా అనుంగు సోదరులకు రత్నకిరీటాలు చేయాలనీ, విరిగిపోయిన వాళ్ళ వేళ్ళకు అంగుళీకాలు చేయాలనీ వారి గాధల ప్రథమాంకం నా రచన అనీ చెప్పుకున్నారు.


కోలుకోలేనితనాన్ని ప్రేమించేవాళ్ళు స్వకీయ విలక్షణ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వాళ్ళు కవులయితే, సుకుమారులయితే వాళ్ళ భాధ కూడా విచిత్రాన్ని పులుముకుంటుంది. నిరాశకు మారు పేరయిన నిహిలిజం వాళ్ళు పిలవకున్నా వాళ్ళని వెంబడిస్తుంది. అన్నింటి పట్లా ఆయన నమ్మకం ఒక ఆకర్షణని అదనంగాఅ అందిస్తుంది. అది అన్నీ కోల్పోయిన వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. తమాషా ఏమిటంటే ప్రపంచయుద్ధ బీభత్సాలకు మనసు పాశ్చాత్యకవుల ప్రతిభా శకలాలతో పోల్చదగిన అధునాతన అభివ్యక్తిని నలబై ఏళ్ళ క్రితమే సాధించిన కృష్ణారావు గారు అధోజగత్‌ సహోదరుల్తో ఆత్మీకంగా ఏకంకావలని ప్రయత్నించడమే. ఒకే కవితలో అధివాస్తవిక అభివ్యక్తి దానికి లొంగని జీవన వాస్తవికత ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది.


"అనుక్షణం అతి సున్నితమైన దారానికి


వ్రేలాడుతుంటుంది ప్రాణం


అద్దంలో ముఖం చూసుకుంటే


అప్పుడప్పుడూ వక్రించి ఉంటుంది


ఫలానా రోజున సూర్యుడు పొడమడనీ


నక్షత్రాలు పొగడపూలలా రాలిపోతవనీ


అల్లకల్లోలం ఆక్రమించుకుంటుందనీ


ఒక వుద్రేకం అప్పుడప్పుడు


ఆవిష్కరింపబడుతుంది.


అద్దెయింటి కిరాయి దగ్గర


దుకాణం సరుకల దగ్గర


అలవాట్ల అంగిట్లోపట్టే పడిశం దగ్గర


పరువునిద్రించే తెరమరుగున


వుమ్మిలో బడ్డ యీగలాగా


మనస్సుకు సంకెళ్ళుపడుతై (88పేజి)


కృష్ణారావు గారి అభివ్యక్తిలో ఆధునిక, ఆధునికానంతర ధోరణులు ఉన్నాయి. కానీ ఎక్కడా జీవితం పట్ల ఆఆశ, నమ్మకం లేవు.


'ఆలయాల్ని శిథిలాలు చేసి వాటిలో విగ్రహాలు వెతకడం'వంటి విధ్వంస ఆకర్షణలు అవిశ్రాంతం సంపుటిలో కనిపిస్తాయి. తన అస్తిత్వాన్ని విస్మరించి జనంలో కలవాలన్న తపనా ఈ సంపుటిలో కనిపిస్తుంది. తన ఒంటరి స్తంభంలోని ఆలోచనల్ని ఆయన గుర్తించినట్టు కూడా తెలుస్తుంది.


'నా' అనే కవితలో 'నీ'ను విస్మరించి నలుగురిలో నలుసుగా మెలుగు


ఒక్క గజం కొలుస్తూ ఏకాకివి కాకు


అందరితో ఒకేసారి రోదించు


ఒకేస్వరంతో స్పందించు


భుజం భుజం కలిపి సంఘర్షించు' అంటారు.


ప్రపంచంలో విషాదమేకాదు, ఆనందం కూడా ఉంది. కానీ కృష్ణారావుగారి లాంటి సున్నిత సుకుమార భావుకులు కొమ్మనించి రాలుతున్న పువ్వులోనూ మానవ జాతి సామూహిక మరణ్ దృశ్యాన్ని చూస్తారు. భయం అన్నది వారి బాధలో కలిసిపోయింది. కన్నీళ్ళు కార్చిన నేత్రాలు ఆనందబాష్పాలు కూడా రాలుస్తాయన్న సత్యాన్ని కృష్ణారావుగారు అంగీకరించరు. పాక్షిక ప్రదర్శన చేసే పరివేదనా పార్శ్వాన్నే ఇష్టపడతారు.


కృష్ణారావుగారు ఆధునికులేకాదు, అత్యాధునికులు కూడా. కృష్ణారావుగారి కవిత్వం బండబారిన, చలనంలేని చైతన్యంలోని మనసుక్ని ఛేదిస్తుంది. జీవితమంతా హాయిగా వుందాలనుకునే వాళ్ళు, ఒక సాంప్రదాయాన్ని భుజాన వేసుకున్నవాళ్ళు, పీఠాధిపతుల బీటలు వారేలా చేసే అధునాతన అణు విస్పోటనలు కృష్ణారావుగారి కవితలు. కానీ నమ్మకం లేకపోవడం అన్నికన్నా విషాదం. నమ్మకం లేకపోసే విషాదం నిషాగా మరుతుంది .. గిల్బర్ట్‌ అన్నట్లు...


Heavy the sorrow that bows the head where love is alive and hope is dead.




సౌభాగ్య


ఆంధ్రప్రభ 10.1.1999 నుంచి




(ప్రచురణ : 1997, రచన: సి.వి కృష్ణారావు, పేజీలు :268, వెల 50/-రూపాయలు ,


పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ, విశాలాంద్ర, హైదరాబాద్‌ 500 001.

0 కామెంట్‌లు

అరుదైన సాహితీ సేవ


సమకాలీన సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో చెరిగిపోని అడుగుజాడలు సృష్టించిన సాహితీవేత్త కృష్ణారావు

శరత్కాల సాయం సంధ్య పున్నాగ పూల పరిమళాలతో గాలులు తెరలు కడుతున్నాయి. నగరాకాశం మీద చంద్రుడుదయిస్తున్నాడు. హోటల్వైస్రాయ్కాన్ఫరెన్స్హాల్లో డాక్టర్రామినేని ఫౌండేషన్పురస్కార సభ. హాలంతా డాక్టర్ కె.ఆర్‌. సూర్యనారాయణ వీణానాదంతో పులకిస్తోంది. పురస్కారాలందుకున్న వాళ్ళలో సి.వి. కృష్ణారావు కూడా ఉండడం ఆనాటి ఆనందానికి మరింత వన్నె తెచ్చింది.

సి.వి.కృష్ణారావు(1926) జీవితకాలపు కృషి కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితమయింది కాదు. ఆయన జీవితం పేదవాళ్ళకూ, తరతరాలుగా సాంఘికంగా అణగారుతూ వస్తున్న వాళ్ళకూ ఒక ఓదార్పుగా, ఒక వాగ్దానంగా, ఒక బాసటగా ఉంటూ వచ్చింది. ఆయన విద్యార్థి రోజుల్లో నిషేధిత సోషలిష్టు పార్టీ తరపున అరెస్టయి జైలుకు వెళ్ళినవారు. దాసరి నాగభూషణరావు దగ్గర కమ్యూనిష్టు పాఠాలు నేర్చుకున్నవారు. సాంఘిక సంక్షేమ శాఖలో సాంఘిక సేవా కార్యకర్తగా అదిలాబాదునుంచి తూర్పు గోదావరి మన్యసీమల దాకా ఆయన చూడని దళితవాడ, అడుగుపెట్టని గిరిజన గూడెం లేవంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికి పాతికేళ్ళూ పైబడ్డ మాటే. తూర్పుగోదావరి జిల్లాలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్అధికారిగా ఆయన మా గిరిజన గ్రామాలకి వచ్చారు. మా పల్లెల్లో సాధారణ రెవెన్యూ ఉద్యోగులు కూడా ఎంతో అధికార ధర్పం ప్రదర్శించే రోజుల్లో ఆయన ఆదివాసుల్ని పేరు పేరునా పలకరిస్తూ వాళ్ళతో అడవి అంచుల్లో పొలం గట్లమీద కలిసి నడుస్తుండేవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూలు కులాలు, షెడ్యూల్తెగల అభివృద్ధికి, సంక్షేమానికీ కొత్తదారులు వేసిన తొలితరం కార్యకర్త. ఆయన. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు అలిఖిత ఒరవడి ఆయనదే. అందుకనే జి. ఫణికూమార్తన గోదావరి గాధలకు పరిచయంకోసం కృష్ణారావును అభ్యర్థించారు.

ఉద్యోగ, వైయక్తిక, సృజనాత్మక జీవితాలు వేరు వేరు పరిధిల్లో సంచరించే మనుషుల మధ్య కృష్ణారావు లాగా తన అన్ని వ్యాసాంగాలకూ కేంద్రాన్నొకటిగానే ఉంచుకొనేవాళ్ళు అరుదు. ఆయనకు హరిజనులతో సాంగత్య, సామీప్యం కేవలం ఉద్యోగ జీవితానికే పరిమితం కాలేదు. బహుశా జాషువా తరువాత, సామాజిక అసమ్మతి స్వరాన్ని అంత బలంగా సమాజం ఎదుట లేవనెత్తింది కృష్ణారావు అనొచ్చు. అందుకు సజీవ సాక్ష్యం వైతరిణి(1968) కావ్యం. అది కావడానికి 16 కవితల చిన్న కావ్యమే అయినా వస్తువులో, అభివ్యక్తిలో అది నిస్సందేహంగా అభ్యుదయానంతర యుగానికి మేలుకొలుపు. అత్యంత సరళమైన, నిష్కపటమైన, ప్రజాస్వామిక సంస్కృతిలో కూడిన రచన అది. 'మానవులు మాలిన్యం చేసే చోట్లను ఒర్పుల చీపుర్లతో తుడిచిన' రచన అది. తిరిగి తొంబైల్లో దళిత కవిత్వం ప్రధాన సాహిత్య చైతన్యాన్ని ఆకట్టుకునే దాకా అటువంటి రచన తెలుగులో రాలేదనే చెప్పాలి. యథార్థినికి మాదీ మీ ఊరే (1959) ఆయన మొదటి ప్రచురణ అయినా, ఒక ఏడాది ముందే వైతరిణి తన మనసులో రూపుదిద్దుకుంటూ ఉండేదని ఆయన ఒకసారి అన్నారు..

మధ్యలో అవిశ్రాంతం (1991) తరువాత ఆయన వెలువరించిన కిల్లారి (1996) ఆధినికానంతర యుగానికి వేకువ కేక. ఇంకా తెలుగు కవిత్వం ఆధునిక నిర్మాణాల్ని చూడలేకపోతున్న సమయంలో ఆయన కవిత్వాభివ్యక్తిలో మౌలిక పరివర్తనను తీసుకువచ్చారు. తన కాలం కన్నా ముందుండగలగడానికి ప్రథాన అర్హత తన హృదయమెప్పుడూ జ్వలిస్తుండడమే.. హృదయ ప్రజ్వలనానికి కిల్లారి కావ్యంలో ప్రతీ పంక్తీ సాక్ష్యమిస్తుంది. అంతే కాదు, అది తన ఇంట్లో నీడపట్టున కూర్చొని , భూకంపంవల్ల నిర్వాసితులైన అక్కడి కుటుంబాలకు తన హృదయాన్ని ఊతమిచ్చి రాసిన కవిత. అందుకే డాక్టర్సుమనశ్రీ 'నీ ఆదర్శాలు నా కనవసరం, నీ ఆచరణని చూపమంటుంది ఉత్తరాధునికత'అని రాశారు. మాటలు రాయడానికి స్ఫూర్తి కృష్ణారావే అని నేననుకుంటాను.

బాధ్య కలిగిన అధికారిగా, వచన మార్గానికి చెందిన ప్రజాకవిగా కృష్ణారావు అందించిన సేవలకన్నా మరెంతో అమూల్యమైన సేవ ఆయన గత ఇరవయ్యేళ్ళుగా నెలనెలావెన్నెలద్వారా సాగిస్తున్న కృషి, 1982నుంచి నేటిదాకా ప్రతినెలా చివరి ఆదివారం ఆయన ఇంట్లో కొందరు సాహిత్యాభిమానులు జమకూరుతున్నారు. వాళ్ళందరికి తమ తమ కొత్త కవితల్ని అక్కడ చదివి వినిపించడమే అజెండా. సైద్ధాంతిక నిబద్ధత కన్నా తన అనుభూతికీ, తన బుద్ది వ్యాపారానికీ లొంగకుండా తన హృదయాన్ని చీల్చుకొని పైకొచ్చే అభివృద్ధికే ప్రధాన్యాన్నివ్వాలకునే కవులకు నెలనెలా వెన్నెల ఒక మద్దతు. అలా కృష్ణారావు నిబద్దుడని కాదు. ఆయన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు "కళాత్మక వ్యాసాంగానికి సంఘజీవితంలో ఉన్న రక్తమాంసాల్ని పంచుకోవడంలో అవినాభావ సంబంధం ఉంది. లేకపోతే ఉత్త సాహిత్య వ్యాసాంగం నరంలేని వేలు".

ఇక్కడ చూడాల్సింది కృష్ణారావు నిబద్ధతను వదులుకోకుండానే సాహిత్య విలువల కోసం ప్రయత్నిస్తుండటం. నిబద్ధతను యాత్రికంగా విధించడంగానీ లేదా అంగీకరించడం గానీ రెండూ జీవితాన్ని, మానవ సంబంధాల్నీరుకున పెడతాయి. ముఖ్యంగా సృజనాత్మక వ్యాసాంగాన్ని అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాకాక సృజనాత్మక కృత్యాద్యవస్థలో మనం సాధకుడి వెంట ఉండి అతని స్ఫూర్తినిస్తున్న దర్శనమేదో తనదైన పద్దతిలో తాను వ్యక్తీకరించగలిగే విధంగా అతనికొక అవకాశాన్ని వదిలామనుకోండి అప్పుడతనొక అడుగు ముందుకు వెయ్యగలుగుతాడు. తాను దేనికి నిబద్దుడిగా ఉండాలో తానే ఎంచుకోగలడు. పిట్టలు రెక్కలొచ్చి తమ దోవన తాము ఎగిరి పోయేదాకా నీడానిచ్చే వెచ్చనిగూడులా, ఒక లాంచింగ్పాడ్లా ఎందరో యువ కవులకు నెలనెలా వెన్నెల ఉపకరించిందనడం ఒక సాహిత్య యథార్థం.

నెలనెలా వెన్నెల గురించి కృష్ణారావుకున్న స్పష్టత ఆయన మాటల్లోనే చూడొచ్చు "నెలనెలా వెన్నెల్లో ఎవరి వ్యక్తిత్వవికాసం వారిది. సభ్యత్వం లేదు, చందాలు లేవు, ఇందులో పాల్గొనేవారందరూ వర్తమాన యుగ స్పందన గలవారే. ప్రచారంతో సంబంధం లేకుండా కవిత్వాకర్షణే ధ్యేయంగా పెట్టుకుని ఇక్కడకు వస్తారు. ఇంకో ధ్యాస ఏదీ లేదు. అత్యాధునిక కవితా వ్యాసంగం, కవితా చర్చ నేటి ప్రముఖ విషయాలు, చిన్నపిల్లల దగ్గరనుంచి ఇప్పటికే పేరొచ్చిన కవుల వరకూ నెలనెలా వెన్నెల ఒక కలయిక క్షేత్రంగా ఉంది" అన్నారాయన. నేనిప్పటికీ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా కృష్ణారావు అడుగు జాడల్ని పోల్చుకుంటూనే ఉంటాను. అడుగు జాడలు సమకాలీన సాహిత్య సాధనా క్షేత్రంలో కూడా అంతే స్పష్టం. నీ డేరాలోంచి నీ తల బయటపెట్టకు/ సారి నీ ఆయుధం బయటపెట్టు అన్నాడాయన.

వాడ్రేవు చినవీరభద్రుడు

ఇండియా టుడే ... 4 నవంబరు 2008
5 కామెంట్‌లు